ఆర్టీసీ.. అసౌకర్యాల ప్రయాణం!
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీలో ‘మహాలక్ష్మి’ పథకం అమలుతో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆ సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెరగకపోవడం, కిక్కిరిసి ప్రయాణించాల్సి రావడం, ఉన్న సిబ్బందిపై ఒత్తిడి పెరగడం వల్ల ప్రయాణం అసౌకర్యాల మధ్య సాగుతోంది. దీంతో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణికులకు వాటర్‌బాటిల్, ఏసీ బస్సుల్లో దుప్పట్లు అందించడం, చెయ్యెత్తితే బస్సులు ఆపడం మాటెలా ఉన్నా స్టాప్‌లోనూ నిలపకుండా వెళ్తున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపకపోవడంపై అధికారులకు ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. గంటల తరబడి వేచి చూస్తుండగా.. సమయపాలన లేకుండా బస్సు వెనకాల బస్సు రావడం ప్రయాణికులను అసంతృప్తికి గురి చేస్తోంది.
దుప్పట్లేవి..
రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. దూర ప్రాంతాలైన హైదరాబాద్‌కు వెళ్లే ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు దుప్పటి(రగ్గులు) అందించాల్సి ఉంటుంది. బస్సు డిపోకు చేరగా దుప్పట్లు ఉతికి మళ్లీ ఇచ్చేందుకు కాంట్రాక్టర్‌ను నియమించారు. ఎక్కడా ప్రయాణికులకు దుప్పట్లు అందించిన దాఖలాలు లేవు. కనీసం చలికాలంలోనైనా దుప్పట్లు ఇవ్వకపోవడంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. దుప్పట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లించాల్సిందే.
స్టాప్‌లో నిలుపకుండానే..
కొందరు పల్లెవెలుగు బస్సుల డ్రైవర్, కండక్టర్ల తీరులో మార్పు రావడం లేదు. బస్టాప్‌లో నిలుపకుండానే వెళ్తున్నారు. లక్సెట్టిపేట, చెన్నూర్ రూట్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. వేంపల్లి, ముల్క ల్ల, ఊరు శ్రీరాంపూర్ తదితర ప్రాంతాల్లో బస్సులు నిలుపడం లేదని తెలుస్తోంది. ఎవరైనా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో తెలియక ఎక్కితే దిగే చోటు నిలుపకుండా మరో స్టేజీలో దింపుతూ దురుసుగా వ్యవహరిస్తున్న డ్రైవర్లు లేకపోలేదు. పల్లె వెలుగు అద్దెబస్సుల సిబ్బందిపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రయాణికులు అధికారుల దృష్టికి తీసుకెళ్తే చర్యలు తీసుకుంటున్నారు. బస్టాప్‌లో నిలుపకుండా మొదటిసారి రూ.300, రెండోసారి రూ.500, మూడోసారి రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లకు రెండుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చి మరోసారి శాఖాపరమైన చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
చెన్నూర్, ఆసిఫాబాద్ రూట్లలో..
మంచిర్యాల బస్టాండ్‌లో సాయంత్రం కాగానే చెన్నూర్, ఆసిఫాబాద్ ప్లాట్‌ఫారాలపై ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ప్రయాణికుల సంఖ్యకు తగినట్లుగా బస్సులు లేకపోవడమే సమస్య. మరో ఆరేడు బస్సులు వస్తేనే కొంత మేర సమస్య తీరనుంది. చాలామంది ప్రయాణికులకు సమస్య ఎదురైనప్పుడు ఫిర్యాదులు ఎక్కడ చేయాలో తెలియని పరిస్థితి. సమస్యల పరిష్కారం, సలహాలు, సూచనల కోసం డయల్ యువర్ డీఎం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
అడిగితేనే వాటర్‌బాటిల్
సుఖవంతమైన ప్రయాణానికి ఆర్టీసీ సూపర్ లగ్జరీ, లహరి బస్సులు ప్రవేశపెట్టింది. పుష్ బ్యాక్ సీట్లతోపాటు టీవీ, వాటర్‌బాటిల్ అందించే ఈ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తోంది. జిల్లాలో వివిధ రకాల బస్సులు 142 ఉండగా.. ఇందులో 69 అద్దె బస్సులు ఉ న్నాయి. 62వేల కిలోమీటర్లు నడపడం ద్వారా రూ.34లక్షల నుంచి రూ.36లక్షల వరకు ఆదా యం సమకూరుతోంది. 30 లగ్జరీ, నాలుగు లహరి, నాలుగు రాజధాని బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.10 అదనపు చార్జీ వసూలు చేస్తున్న యాజమాన్యం ప్రయాణికులకు అరలీటర్ వాటర్‌బాటిల్ అందించాల్సి ఉంటుంది. టిమ్ డ్యూటీ డ్రైవర్లు ఒక్కో బాటిల్ ప్రయాణికునికి అందిస్తే రూ.1 చొప్పున కమీషన్ చెల్లిస్తారు. ఏసీ బస్సుల్లో డ్రైవర్‌తోపాటు అటెండర్ ఉన్నా కూడా వాటర్‌బాటిల్ ఇవ్వడం లేదు. దీంతో ప్రయాణికులు బయట కొనుగోలు చే యాల్సి వస్తోంది. టికెట్‌తోపాటు వాటర్‌బా టిల్ ఇవ్వాల్సి ఉండగా.. అడిగితే గానీ ఇవ్వ డం లేదు. ప్రయాణికులకు ఇవ్వని వాటర్‌బాటిల్ ఏమవుతున్నాయో ఎవరికీ అంతుచిక్కడం లేదు.


