సీసీఐ నిబంధనల మేరకే పత్తి కొనుగోళ్లు
దండేపల్లి/తాండూర్: సీసీఐ నిబంధనలు పాటిస్తూనే రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను సూచించారు. సోమవారం తాండూర్ మండలం రేపల్లెవాడ శివారులోని మహేశ్వరి జిన్నింగ్ మిల్లులో బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో, దండేపల్లి మండలం కన్నెపల్లి శ్రీవెంకటేశ్వర జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారానే స్లాట్‌లు బుక్ చేసుకొని పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు. 12శాతం తేమ మించకుండా సరి చూసుకుని మద్దతు ధర పొందాలని అన్నారు. తాండూర్‌లో కొందరు రైతులు మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తేమ శాతాన్ని సడలించాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ సీసీఐ అధికారులు కొంతమేర సడలింపులు ఇవ్వాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. తొలి రోజు 11 వాహనాల్లో రైతులు పత్తిని తీసుకురాగా ఒక్క వాహనంలోని పత్తి మాత్రమే సీసీఐ అధికారులు కొనుగోలు చేశారు. మిగతా వాహనాల్లోని పత్తి తేమ శాతం 20 నుంచి 30 వరకు ఉండడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించాల్సి వచ్చింది. క్వింటాల్‌కు రూ.6500 మాత్రమే చెల్లించడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, జిల్లా మార్కెటింగ్ అధికారి షహబొద్దీన్, లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేంచంద్, వైస్‌చైర్మన్ ఆరీఫ్, తాండూర్ తహసీల్దార్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్
లక్సెట్టిపేట: చేప పిల్లల పంపిణీపై రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్లతో సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ కుమార్ దీపక్ లక్సెట్టిపేట తహసీల్దార్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ నెల 20లోగా చెరువులు, రిజర్వాయర్లలో చేపపిల్లల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లా మత్య్సశాఖ అధికారి అవినాష్, తహసీల్దార్ దిలీప్‌కుమార్ పాల్గొన్నారు.


