అవగాహనేది..!
ఎస్సీ ఉపకార వేతనానికి విద్యార్థులు దూరం 9, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు 40లోపే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల రిజిస్ట్రేషన్లు ఒక్క దరఖాస్తూ చేయని ‘ప్రైవేటు’
విద్యాదీవెనపై
మంచిర్యాలఅర్బన్: రాజీవ్ విద్యాదీవెన పథకం కింద అందించే ఉపకార వేతనాలపై ప్రచారలోపం విద్యార్థులకు శాపంగా మారుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో అర్హుల కు అందకుండా పోతోంది. షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల్లో డ్రాపౌట్ శాతాన్ని తగ్గించడం, 9, 10వ తరగతుల విద్య పూర్తి చేయడానికి ఆర్థికసాయం అందించడం పథకం ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనా లు అందిస్తారు. ఈ–పాస్‌లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 9, 10వ విద్యార్థులకు ఈ ఏడాది నుంచి డేస్కాలర్‌కు రూ.3,500, ప్రీమెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు రూ.7వేలు(కాస్మెటిక్, పుస్తకాలు, ఇతరత్రా) చొప్పున చెల్లించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్ ఇప్పటి నుంచి నేరుగా విద్యార్థి లేదా తల్లిదండ్రల ఖాతాల్లో డైరెక్టు బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) పద్ధతిన బదిలీ కానుంది. ఇప్పటికే సగం విద్యాసంవత్సరం పూర్తయినా పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోయారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 1072 ఉండగా.. 5,271మంది ఎస్సీ విద్యార్థులు ఉన్నారు. యాజ మాన్యాలు, అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 219మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 40మంది మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎందుకిలా..?
ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10వ తరగతి విద్యార్థులకు 2012 నుంచి షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ఉపకార వేతనాలు(రాజీవ్ విద్యాదీవెన పథకం) అందిస్తున్నారు. ఈ ఏడాది నుంచి ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకూ స్కాలర్‌షిప్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి 17నుంచి పథకం అమల్లోకి వచ్చినా ప్రచారం లేకపోవడం, అవగాహన లేమి, అనేక నిబంధనలు వెరసి విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. దరఖాస్తుకు బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులు రూ.2లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.250లక్షలు ఆదాయం కలిగి ఉన్నవారు అర్హులుగా పరిగణిస్తారు. విద్యార్థులకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిచేందుకు బ్యాంకర్లు విముఖత చూపడం కూడా కారణంగా తెలుస్తోంది. ముందుగా పాఠశాల యూడైస్ ప్రకారం ఈపాస్ పోర్టల్‌లో పాఠశాలను రిజిష్టర్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ డిపార్టుమెంటు మ్యాపింగ్ చేయాలి. తర్వాత విద్యార్థులు ఈపాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల ఈపాస్‌లో స్కూల్ నమోదు చేయకపోవడం వల్ల విద్యార్థులు ఉపకార వేతనానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై ఏడు నెలలు గడిచినా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఒక్కరూ రిజిష్టర్ కాలేదు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు అవసరమైన చర్యలు తీసుకుంటే అర్హులైన ఎస్సీ విద్యార్థులకు ఎంతో మేలు జరుగనుంది.
విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఎస్సీ విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి. 9, 10వ తరగతి విద్యార్థులకు రూ.3,500 చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ–పాస్‌లో పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులకు వర్తిస్తుంది. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో విధివిధానాలపై సూచనలతోపాటు సందేహాలు నివృత్తి చేశాం. ఎస్సీ విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– దుర్గాప్రసాద్,
జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి
ఎస్సీ విద్యార్థుల వివరాలు
పాఠశాలలు 9వ తరగతి 10వ తరగతి
ప్రభుత్వ 837 2050 1892
ప్రైవేటు 235 670 639


