నేడు చేపపిల్లల విడుదల
మంచిర్యాలఅగ్రికల్చర్: ఎట్టకేలకు చేపపిల్లల విడుదలకు మోక్షం లభించింది. మంగళవారం జిల్లాలో పంపిణీకి అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో విడుదలకు సిద్ధం చేశారు. జూలైలో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, జలాశయాలు నిండాయి. ఆగస్టులో చేపపిల్లలు వదలాల్సి ఉండగా.. గతంలో చేపపిల్లలు సరఫరా చేసిన టెండర్‌దారులకు ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈసారి టెండర్‌దారులు ముందుకు రాలేదు. రెండు నెలలుగా పలుమార్లు టెండర్ల గడువు పెంచుతూ వచ్చింది. అక్టోబర్‌లో టెండర్లు ఖరారు కాగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ ఎత్తివేసి 20రోజులు గడిచినా విడుదలకు నోచుకోలేదు. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, మత్స్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ నెల 4నుంచి చేపపిల్లల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని 380 చెరువులు, కుంటలు రిజర్వాయర్లలో 2.23 కోట్ల చేపపిల్లలు విడుదల లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో 35నుంచి 40 మిల్లీమీటర్ల పరిమాణం గల పిల్లలు(కట్ల, రవు) 115.65లక్షలు, 80 నుంచి 100 మిల్లీమీటర్ల పరిమాణం గల పిల్లలు(కట్ల, రవు, మృగాల) 108.28లక్షలు విడుదల చేయనున్నారు. కాగా, ఆలస్యంగా చేపపిల్లలు వదలడం వల్ల ఏ మేరకు ఎదుగుదల ఉంటుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలపాటు ఎదిగి మార్చి నుంచి మే వరకు మంచి దిగుబడి వస్తుంది. మూడు నుంచి నాలుగు కిలోల వరకు పెరిగి మత్స్యకారులకు ప్రయోజనం చేకూరేది. కానీ.. ఆలస్యంగా వదలడం వల్ల ఎప్పుడు ఎదిగి.. ఎప్పుడు దిగుబడి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. కొత్త వర్షాలతో నీరు చేరి వాటికి కావాల్సిన ఆహారం సమృద్ధిగా లభించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలం ముగిసి ఎండలు మండుతున్నాయి. మరికొద్ది రోజుల్లో యాసంగి పంటలకు నీటి విడుదల చేపట్టనున్నారు. నాలుగు నెలల సమయంలో చేపపిల్లలు ఏ మేరకు ఎదుగుతాయో అధికారులకే తెలియాలని మత్స్యకారులు వాపోతున్నారు. ఇప్పటికే మత్స్యకారులు స్వయంగా కొనుగోలు చేసి చెరువుల్లో వదిలారు. జిల్లాలో చేపపిల్లల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో 51.58 లక్షల చేపపిల్లలు విడుదల చేస్తామని పేర్కొన్నారు.


