
భూ చిక్కులకు చెక్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూమి కొలతలు, సర్వేలు, హద్దుల నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించే సర్వేయర్ల కొరత తీరనుంది. కొత్తగా లైసెన్స్‌డ్ సర్వేయర్ల కోసం ప్రభుత్వం ఎంపిక ప్రక్రియ చేపట్టింది తెలిసిందే. గ్రామాల వారీగా ప్రభుత్వ ఆమోదిత లైసెన్స్‌డ్ సర్వేయర్ల కోసం దరఖాస్తులు స్వీకరించిన అధికారులు గత జూలైలో వీరికి పరీక్షలు నిర్వహించారు. తొలివిడతలో 331మంది దరఖాస్తు చే సుకోగా అర్హతలున్న 129మంది పరీక్షలు రాశారు. వీరిలో 99మంది ఆసక్తి చూపగా 40రోజుల పాటు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. రెండో విడతలో 169 దరఖాస్తులు రాగా, వీరిలో 135మంది పరీక్షలు రాశారు. వీరికి ఇంకా శిక్షణ ఇవ్వాల్సి ఉంది. అయితే తొలి దశ సర్వేయర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ స్థానిక ఎన్నికలు, కోడ్ కారణంగా ముందుకు సాగలేదు. తాజాగా ఎన్నికలు వాయిదా పడి కోడ్ లేకపోవడంతో సర్వేయర్ల సేవల్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇటీవల రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లైసెన్స్ పొందిన సర్వేయర్ల సేవలు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో జిల్లాలో సర్కారు ఆమోదిత సర్వేయర్లు పల్లెల్లో సర్వే శాఖకు అందుబాటులోకి రానున్నారు.
వేధిస్తున్న కొరత
జిల్లాలో రెవెన్యూ శాఖ పరిధిలో సర్వేలు, భూ హ ద్దులు, వివాదాలు, కొలతల నిర్ణయాలకు అనేకంగా దరఖాస్తులు వస్తున్నాయి. అయితే సరిపడా సర్వేయర్లు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 18 రెవెన్యూ మండలాల పరిధిలో సగం మంది కూడా సర్వేయర్లు లేరు. ఇన్‌చార్జీలతో నెట్టుకురావాల్సి వ స్తోంది. ఒక్కో సర్వేయర్ రెండేసి మండలాలు బాధ్యతలు చూస్తుండగా వీరిపై అదనపు భారం ఉంది. వీటితో పాటు జిల్లాలో భూ సేకరణ కోసం, సింగరేణి బొగ్గు గనుల కోసం, పరిహారం చెల్లింపుల కోసం సర్వేయర్ల అవసరమేర్పడుతోంది. వీటికి తోడు జాతీయ రహదారుల నిర్మాణం కోసం వందల ఎకరాల్లో భూములు సేకరించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సర్వేయర్లు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో భూ సేకరణ సమయంలో స ర్వే చేయకపోవడంతో జాప్యం జరుగుతోంది. వీటితో పాటు రైతులు తమ భూముల హద్దుల విషయంలోనూ అర్జీలు ఇస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, అటవీ భూములు ఇతర వివాదాలు ఏర్పడినప్పుడు సర్వేయర్లు ఇచ్చే నివేదిక ప్రధానంగా మారుతోంది. ఈ క్రమంలో జిల్లాలో కొత్తగా లైసెన్స్‌డ్ సర్వేయర్లు అందుబాటులోకి వస్తే చాలా వరకు రెవెన్యూ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముంది.
తొలి విడత సర్వేయర్లకు శిక్షణ పూర్తి
జిల్లాలో తొలివిడత సర్వేయర్ల శిక్షణ పూర్తయింది. రెండో విడత పరీక్ష రాసిన వారు శిక్షణ పూర్తి చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు లైసెన్స్ డ్ సర్వేయర్ల సేవలు అందుబాటులోకి తెస్తాం.
– వీ శ్రీనివాస్, ఏడీ, సర్వే లాండ్ రికార్డ్స్