
గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకుడు మృతి
తానూరు: మండలంలోని దర్మాబాద్ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకుడు మా ల్వే ఎంకోబా (70) మృతి చెందినట్లు ఎస్సై షేక్ జు బేర్ తెలిపారు. మృతుడు కొన్ని రోజులుగా తానూ రు మండలంలో భిక్షాటన చేసుకుంటున్నాడు. ఆదివారం రాత్రి రోడ్డుపై పడుకుని ఉండగా గుర్తు తెలియని వాహనం అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై షేక్ జుబేర్ సోమవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముధోల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని కుమారుడు మాల్వే బాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
జ్వరంతో ఇంటర్ విద్యార్థిని..
మందమర్రిరూరల్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వెంకటాపూర్‌కు చెందిన చిట్టవేణ అశ్విత (17) పది రోజుల క్రితం దసరా సెలవులకు అమ్మమ్మ ఊరైన బెల్లంపల్లి మండలంలోని ఆకెనపెల్లికి వెళ్లింది. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం
బెజ్జూర్: పురుగు మందు తాగి ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని మర్థిడిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్థిడికి చెందిన బోర్‌కుట్ మల్లయ్యకు ఇటీవల అదే గ్రామానికి చెందిన మన్నెంపెల్లి ఓనయ్య దంపతులతో గొడవ జరిగింది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మల్లయ్యపై ఈనెల 9న కేసు నమోదైంది. దీంతో భయాందోళనకు గురై సోమవారం ఉదయం గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా నా ఆత్మహత్యకు మాజీ ఎమ్మెల్యే అనుచరుడు బషరత్ ఖాన్ కారణమంటూ బాధితుడు పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయమై ఎస్సై సర్దాజ్ పాషాను సంప్రదించగా అతనిపై ఈనెల 9న కేసు నమోదు కావడంతో నోటీసు ఇవడానికి పోలీసు సిబ్బంది ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
దాడులకు దారితీసిన ఆస్తుల పంచాయితీ
జైపూర్: అన్నదమ్ముల మధ్య ఆస్తుల పంచాయితీ చివరకు దాడులకు దారితీసింది. జైపూర్ మండలంలోని వేలాలకు చెందిన ప్యాగ మైసయ్య, రాజసమ్మయ్య ఇద్దరు అన్నదమ్ములు. మైసయ్యకు ముగ్గురు కుమారులు సమ్మయ్య, నాగయ్య, మల్లేశ్. వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలోనే ఉంటున్నారు. రాజసమ్మయ్యకు శ్రీనివాస్, సంతోశ్ కుమారులు. శ్రీనివాస్ సింగరేణిలో ఓవర్‌మెన్ ఉద్యోగం చేస్తుండగా సంతోశ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. మైసయ్య, రాజసమ్మయ్యకు చెందిన భూమి, ఆస్తుల విషయంలో కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి. మైసయ్య వేలాలలో ఇల్లు నిర్మించుకుంటుండగా రాజసమ్మయ్య, అతని కుమారులు అడ్డుకున్నారు. ఇదే విషయంపై ఆదివారం గొడవ చోటు చేసుకోగా ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దాడిలో శ్రీనివాస్, సంతోశ్, రాజసమ్మయ్య భార్య మల్లక్కకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ మేరకు రాజసమ్మయ్య ఫిర్యాదు మేరకు సమ్మయ్య, నాగయ్య, మల్లేశ్, లక్ష్మిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు.
నిందితున్ని పట్టించిన డాగ్ హంటర్
దండేపల్లి: మండలంలోని తానిమడుగు ఫారెస్ట్ బీట్ 394 కంపార్ట్ మెంట్‌లో ఇటీవల టేకుచెట్లు నరికివేతకు గురైనట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆదివారం డాగ్ హంటర్‌తో అడవిలో తనిఖీలు నిర్వహించారు. లభించిన ఆధారాలను వాసన చూసిన డాగ్ హంటర్ తానిమడుగులోని పెందూర్ రాజేశ్ ఇంటికి చేరుకుంది. అతని ఇంట్లో తనిఖీ చేయగా కలప లభించడంతో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి లక్సెట్టిపేట కోర్టులో హాజరు పర్చగా 12 రోజుల రిమాండ్ విధించినట్లు తాళ్లపేట ఎఫ్‌ఆర్వో సుష్మారావు తెలిపారు.