
గోల్డ్‌లోన్ బాధితుల ఆందోళన
చెన్నూర్: బ్యాంక్‌లో తాకట్టు పెట్టిన బంగారు నగలు ఎప్పుడిస్తారని చెన్నూర్ ఎస్బీఐలో గోల్డ్‌లోన్ బాధితులు గురువారం ఆందోళన చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ బ్యాంక్‌పై నమ్మకంతో అవసర నిమిత్తం బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నామని తెలిపారు. రెండున్నర నెలలు గడిచినా బాధితులకు నగలు ఇవ్వడం లేదన్నారు. అపహరణకు గురైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని అప్పగించినా బ్యాంకు అధికారులు బాధితులకు స్పష్టంగా చెప్పడం లేదన్నారు. బ్యాంక్ చీఫ్ మేనేజర్ విజయభాస్కర్ బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వెళ్లేదిలేదని సాయంత్రం వరకు బ్యాంక్‌లోనే ఉన్నారు. కోర్టు నుంచి బ్యాంక్‌కు నగలు చేరలేదని, స్వాధీనం చేసుకున్నాక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పుడిస్తామో చెప్పగలమని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.