
ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలి
బెల్లంపల్లిరూరల్/భీమిని/మందమర్రిరూరల్: ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన బెల్లంపల్లి, కన్నెపల్లి, భీమిని, మందమర్రిలో మండల పరిషత్ కార్యాలయాలను సందర్శించి నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలు, గోడ గడియారాలు, వీడియోగ్రఫి విధిగా ఉండాలని సూచించారు. అభ్యర్థుల అఫిడవిట్లు, ధ్రువపత్రాలు, ఇతర ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బెల్లంపల్లి ఎంపీడీవో మహేందర్, ఎంపీవో శ్రీనివాస్, కన్నెపల్లి, భీమిని ఎంపీడీవోలు గంగామోహన్, శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్లు బికర్ణదాస్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మందమర్రిలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)ను కలెక్టర్ సందర్శించారు.
సమయపాలన పాటించాలి
విధుల్లో సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. కన్నెపల్లి ఎంపీడీవో కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించిన సమయంలో ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డితోపాటు పలువురు సిబ్బంది హాజరు కాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు రిజిష్టర్లు పరిశీలించారు. ఎంపీడీవోకు ఫోన్ చేసి ఆలస్యంపై ఆరా తీశారు.