
మాలేపూర్‌లో ఎన్నిక ఏకగ్రీవమేనా..?
ఒకే కుటుంబంలో సర్పంచ్, మరో నలుగురు వార్డు సభ్యులు? రిజర్వేషన్‌తో వరించనున్న అదృష్టం ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీ
నార్నూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకే కుటుంబంలో సర్పంచ్, నలుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. గతంలో సైతం ఎస్టీ రిజర్వేషన్ రావడంతో ఆ కుటుంబం నుంచే సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని మాలేపూర్ పంచాయతీ పరిధిలో మొత్తం 514 ఓటర్లు ఉన్నారు. ఈ సర్పంచ్ స్థానానికి ఎస్టీ మహిళగా రిజర్వేషన్ ఖరారు చేశారు. అయితే పంచాయతీ పరిధిలో ఎస్సీలు అధికంగా ఉన్నారు. గ్రామంలో మొత్తం 8 వార్డులకు గాను రెండు ఎస్టీ మహిళ, రెండు ఎస్టీ జనరల్‌గా రిజర్వేషన్ ఖరారయ్యాయి. అయితే గ్రామంలో ఒకే ఒక గిరిజన కుటుంబం నివాసం ఉంటుంది. ఆ కుటుంబంలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు మొత్తం ఆరుగురు ఓటు హక్కు కలిగి ఉన్నారు. దీంతో వారిలో ఒకరు మహిళ సర్పంచుగా, నాలుగు వార్డులకు ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు వార్డుమెంబర్లుగా ఏకగ్రీవం కానున్నారు. ఉప సర్పంచ్ పదవీ సైతం వీరికే వరించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎస్టీ జనరల్ ఖరారవగా పవార్ ఇందల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అలాగే మరో మూడు వార్డుమెంబర్ స్థానాలు సైతం ఎస్టీ జనరల్‌కు కేటాయించడంతో ఆ ఇంటి నుంచే ముగ్గురు (ఇద్దరు పురుషులు, ఒక మహిళ) ఏకగ్రీవంగా ఎన్నికవడం గమానార్హం. ఈ ఏడాది కూడా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ కలిసి రావడంతో ఈ సారి ఈ ఇంటి నుంచి ఐదుగురు ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది.