
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
గుడిహత్నూర్: అనుమానాస్పదస్థితిలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా గుమ్‌గావ్‌కు చెందిన భగ్నూరే రాహుల్ (35)కు మండలంలోని కొల్హారీ గ్రామానికి చెందిన లక్ష్మీబాయితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. రాహుల్ తన భార్యతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నాయని గుమ్‌గావ్‌లో ఉన్న తండ్రి బాలాజీతో ఫోన్‌లో చెప్పేవాడు. శనివారం రాత్రి తండ్రికి ఫోన్‌చేసి తన భార్యతో గొడవ జరిగిందని చెప్పి వెంటనే కట్ చేశాడు. ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన వ్యక్తి ఫోన్‌చేసి మీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందించాడు. కోడలు లక్ష్మీబాయి, ఆమె తల్లి షిండే లలితపై అనుమానం ఉందని మృతుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.