
జ్వరంతో ఇంటర్ విద్యార్థి మృతి
నార్నూర్: గాదిగూడ మండలం ధాబా(కే) గ్రామంలో జ్వరంతో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మెస్రం యెసు, దుర్గుబాయి దంపతుల కుమారుడు మహేశ్ (16) ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏపీఆర్‌జేసీలో ఇంటర్ చదువుతున్నాడు. దసరా సెలవుల్లో పదిరోజుల క్రితం ఇంటికి వచ్చినప్పటి నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లిన జ్వరం తగ్గలేదు. శనివారం ఇంట్లోనే జ్వరంతో బాధపడుతూ మృతిచెందాడు. బాధిత కుటుంబానికి కళాశాల తరపున సహాయం చేయాలని ఆదివాసీ గోండ్వాన సమితి తరపున మెస్రం శేఖర్‌బాబు కోరారు.
చికిత్సపొందుతూ ఒకరి మృతి
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన ఎర్రం హన్మాండ్లు (54) హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. పట్టణంలోని జీఎస్ ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న హన్మాండ్లు గతకొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఆయన భార్య మందలించడంతో మనస్తాపం చెంది ఈనెల 3న ఒంటిపై పెట్రోల్ పోసుకొని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు ఆదిలాబాద్ రిమ్స్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా శనివారం చికిత్సపొందుతూ మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ తెలిపారు.
వివాహిత అదృశ్యం
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని బంగారుగూడకు చెందిన వివాహిత షేక్ నిలోఫర్ అదృశ్యమైనట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. శనివారం ఉదయం 13 ఏళ్ల కుమారుడు షేక్ అయాన్‌తో బ్యాంక్ పని నిమిత్తం పట్టణంలోని శివాజీచౌక్‌కు వెళ్లింది. చెప్పు తెగిపోవడంతో వినాయక్ చౌక్ వద్ద ఉంటానని కుమారుడికి తెలిపింది. అక్కడికి వెళ్లగా తల్లి కనిపించకపోవడంతో తండ్రి షేక్ అలీకి చెప్పాడు. పలు ప్రాంతాల్లో గాలించిన ఆచూకీ దొరకలేదు. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ తెలిపారు.