
ఏరియాలో 56శాతం బొగ్గు ఉత్పత్తి
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలో సెప్టెంబర్‌లో 56 శాతం బొగ్గు ఉత్పత్తి చేశామని ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ తెలిపారు. మంగళవారం జీఎం కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. కేకే–5 గనిలో 17,181 టన్నులు, కాసిపేట గనిలో 12,708 టన్నులు, కాసిపేట–2 గనిలో 11,968 టన్నులు, శాంతిఖనిలో 5,424 టన్నులు, కేకే–ఓసీలో 67,838 టన్నులు బొగ్గు ఉత్పత్తి సాధించామని తెలిపారు. అధిక వర్షాల వల్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏరియాకు సంస్థ నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యంలో 60శాతం బొగ్గు ఉత్పత్తి చేశామని, గైర్హాజరు కార్మికులు విధులకు హాజరై బొగ్గు ఉత్పత్తికి సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్వో టు జీఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యామ్‌సుందర్, డీజీఎం వీఎస్‌ఆర్కే ప్రసాద్, సీనియర్ పీవో బొంగోని శంకర్, ఎస్‌ఈ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.