
నగలు.. రెండు నెలలు ఆగాల్సిందే..!
పూర్తయిన బాధితుల వివరాల సేకరణ పండుగ తర్వాత పూర్తి కానున్న కోర్టు ప్రక్రియ ఆభరణాల కోసం బాధితుల ఎదురుచూపులు
చెన్నూర్: చెన్నూర్ ఎస్‌బీఐ బ్రాంచి–2లో జరిగిన కుంభకోణాన్ని చేధించిన పోలీసులు నగలు బ్యాంకుకు అప్పగింతకు కసరత్తు చేస్తున్నారు. గత పక్షం రోజులుగా ఎస్‌బీఐ గోల్డ్‌లోన్ బాధితుల వివరాలను సీఐ దేవేందర్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు సేకరించారు. కోర్టు ద్వారా బ్యాంకుకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిసింది. దసరా పండుగ దర్వాత బ్యాంకుకు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్యాంకులో 20.250 కిలోల బంగారు నగలు, రూ.1.10కోట్లు నగదు అపహరణకు గురికావడం, పోలీసులు ఆభరణాలను గత నెల 12న పూర్తి స్థాయిలో రికవరీ చేయడం తెలిసిందే. వాటిని బ్యాంకులో భద్రపర్చారు. నిబంధనల ప్రకారం ఆభరణాలను కోర్టు ద్వారా బ్యాంకుకు అప్పగించాల్సి ఉంది. నగలను కోర్టుకు అప్పగించే ప్రక్రియ పూర్తి చేశారు. దసరా పండుగ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు బ్యాంకు ఉన్నతాధికారుల సమక్షంలో బ్యాంకు కస్టడీకి అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
బాధితుల ఎదురుచూపులు
బ్యాంకులో నగలు తాకట్టు పెట్టి రుణం పొందిన రుణగ్రహీతలు నగలు ఎప్పుడు ఇస్తారోనని ఎదురుచూస్తున్నారు. ఆభరణాలు భద్రంగా ఉన్నప్పటికీ చేతికి వచ్చే వరకు భయం భయంగానే ఉందని బాధితుడు తిరుపతి తెలిపారు. పోలీసులు రికవరీ చేశామని ప్రకటించినప్పటికీ నగలు ఎప్పుడు ఇస్తారోనని బ్యాంకు అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. కొందరు నిత్యం బ్యాంకు వద్దకు వచ్చి వెళ్తున్నారు.
వేరు చేయడానికి సమయం
దసరా పండుగ తర్వాత బ్యాంకుకు నగలు అందినా బాధితులకు ఇచ్చేందుకు మరో రెండు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు 402మంది ఉండడంతో రికార్డుల ప్రకారం ఎవరు ఎన్ని గ్రాముల బంగారం తాకట్టు పెట్టారు, ఏయే నగలు ఉన్నాయని వేరు చేయాల్సి ఉంటుంది. 20.250 కిలోల బంగారు నగలను బాధితుల వారీగా వేరే చేసేందుకు సమయం పడుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు.