
ఫోర్జరీ పత్రాలు సృష్టించిన నలుగురిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: ఇంటి భవనానికి సంబంధించి ఫోర్జరీ పత్రాలు సృష్టించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని గంజ్‌రోడ్ ప్రాంతానికి చెందిన సురేష్ మకాడియా 2002లో కన్నలాల్ నుంచి భవనాన్ని కొనుగోలు చేశాడు. కొనుగోలుదారుని ఆధీనంలో ఉన్నప్పటికీ వినియోగంలో లేదు. ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన రంగినేని దీపక్ ఫోర్జరీ పత్రాలు సృష్టించి మున్సిపాలిటీలో పన్ను చెల్లించాడు. అనంతరం రిజిస్ట్రేషన్ అధికారులను పక్కదోవ పట్టించి తన బావ అయిన నరేందర్ దీపక్ దడిగెలవార్ పేరిట 2023లో రిజిస్ట్రేషన్ చేయించాడు. సాక్షులుగా ఆకులవార్ నగేష్, ఆదర్శ్ ఉన్నారు. దీంతో బాధితుడు టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
అటవీ భూమి సాగుచేస్తున్న ఇద్దరిపై..
కుంటాల: కుంటాల బీట్ పరిధిలోని రాయపాడ్ శివారు రిజర్వు ఫారెస్ట్‌లో బుధవారం రాత్రి అక్రమంగా అటవీభూమి సాగు చేస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేయడంతో పాటు ట్రా క్టర్‌ను సీజ్ చేసినట్లు ఎఫ్‌ఆర్వో రాథోడ్ రమేశ్ తెలిపారు. అంబకంటి తండాకు చెందిన ఆడే సత్యవన్, ఆడే దత్తురాం అనుమతి లేకుండా ట్రాక్టర్‌తో అటవీ ప్రాంతంలో దుక్కి దున్నుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అటవీ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. డీఆర్వో రేష్మ, ఎఫ్‌బీవో సంజయ్ పాటిల్, హరిలత, పాల్గొన్నారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
జైపూర్: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన కావేరి పార్దు జాతీయ స్థాయి మినీ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ కోల నాగేశ్వర్‌రావు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబర్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో జరిగే జాతీయస్థాయి మినీ హ్యాండ్‌బాల్ పోటీల్లో రాష్ట్రజట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు తెలిపారు. గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సదరు విద్యార్థిని పీడీ సంతోశ్, పీఈటీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ నాగేశ్వర్‌రావు, వైస్ ప్రిన్సిపాళ్లు స్రవంతి, మహిపాల్ అభినందించారు.