
నర్సాపూర్‌లో అధికారుల విచారణ
ఎఫెక్ట్..
ఇచ్చోడ: ‘ఇందిరమ్మ ఇల్లు ఒకరికి.. బిల్లు మరొకరికి’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆదిలాబాద్ డీపీవో రమేశ్, డీఎల్‌పీవో ఫణిందర్‌రావు నర్సాపూర్ గ్రామంలో విచారణ చేపట్టారు. ఇందిరమ్మ ఇల్లు మంజురైన లబ్ధిదారు ముస్లే నందబాయి భర్త సంతోష్, బేస్‌మెంట్ వరకు ఇల్లు నిర్మించుకున్న ముస్లే నందబాయి భర్త మారుతిని విచారించారు. గ్రామస్తులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో మాట్లాడారు. నివేదికను కలెక్టర్ రాజర్షిషాకు అందజేయనున్నట్లు తెలిపారు.
పంచాయతీ కార్యదర్శి చేతివాటం..
ఇందిరమ్మ ఇల్లు మంజూరులో పంచాయతీ కార్యదర్శి సునీల్ నాయక్ చేతి వాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ముస్లే నందబాయి (భర్త సంతోష్)కు జూన్ 2న ఇందిరమ్మ ఇల్లు మంజురైంది. కానీ సంతోష్ దుబాయ్‌లో ఉండడంతో అతను వచ్చాక ఇంటినిర్మాణ పనులు చేపట్టే విధంగా కుటుంబ సభ్యులు ప్లాన్ వేసుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న ముస్లే నందబాయి (భర్త మారుతి)కి మంజూరు కాలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శి సునీల్‌నాయక్ రంగంలోకి దిగి మీరు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని, మంజూరు విషయం తాను చూసుకుంటానని వారితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో వారు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. నెల రోజులక్రితం దుబాయ్‌లో ఉంటున్న సంతోష్ స్వగ్రామానికి వచ్చి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాడు. ఇంతలో బేస్‌మెంట్ నిర్మాణ బిల్లు రూ.లక్ష ముస్లే నందబాయి (భర్త సంతోష్) బ్యాంక్ అకౌంట్‌లో జమకావడంతో పంచాయతీ కార్యదర్శి వారిని నమ్మంచి వారి అకౌంట్ నుంచి నందబాయి (భర్త మారుతి) అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. దీంతో కార్యదర్శిని నిలదీయడంతో వారం రోజుల్లో లక్ష రూపాయలు తిరిగి ఇస్తానని ఒప్పంద పత్రం రాసి ఇచ్చాడు. ఇల్లు మంజూరైన బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు కలెక్టర్ నివేదిక ఇచ్చిన తర్వాత అసలు నిజాలు బయటపడతాయని నర్సాపూర్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.