
రేపు జీఎం కార్యాలయాల ముట్టడి
శ్రీరాంపూర్: సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 19న కంపెనీ వ్యాప్తంగా జీఎం కార్యాలయాలు ముట్టడించనున్నట్లు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. బుధవారం శ్రీరాంపూర్‌లోని ఆర్కే 5, ఆర్కే న్యూటెక్, ఎస్సార్పీ ఓసీపీ గనులపై నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం మధ్య జరిగిన స్ట్రక్చరల్ సమావేశంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు వెంటనే సర్క్యులర్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఒప్పందాల అమలుపై ఉత్తర్వులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ 12న స్ట్రక్చరల్ సమావేశం బహిష్కరించినట్లు తెలిపారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాల్లో కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కే.వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్, జీఎం కమిటీ ప్రతినిధులు ప్రసాద్‌రెడ్డి, బద్రి బుచ్చయ్య, సంపత్, అద్దు శ్రీనివాస్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్‌ఖాన్, ఫిట్ సెక్రెటరీ మోతె లచ్చన్న పాల్గొన్నారు.