
అతిథి అధ్యాపకుల అరిగోస
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని ప్రభు త్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకులకు గౌరవవేతనం అందక దిక్కుతోచని పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నారు. ఈ విద్యాసంవత్సరంలో తరగతులు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా పారి తోషికం చెల్లించలేదు. నిర్మల్ జిల్లా ముధోల్, భైంసా, నిర్మల్ ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు న్నాయి. భైంసాలో 13మంది, నిర్మల్‌లో 12మంది, ముధోల్‌లో 12మంది, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 12 మంది, చెన్నూర్‌లో ఆరుగురు, మంచిర్యాలలో 7, లక్సెట్టిపేటలో 10 మంది అతిథి అధ్యాపకులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రతీనెల గరిష్టంగా 72 పీరియడ్లకు గాను రూ.28,080 గౌర వ వేతనంగా చెల్లిస్తున్నారు. గెస్ట్ లెక్చరర్లుగా రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. వేతనాలు మాత్రం సరైన సమయానికి రాక కుటుంబ పోషణ అస్తవ్యస్తంగా మారిందని వారు ఆవేదన చెందుతున్నారు. మూడు నెలలకోసారి బడ్జెట్ విడుదలై బిల్లులు చేసి వీరికి చెల్లించే సరికి మరింత జాప్యం జరుగుతోంది.
సమస్యలతో సతమతం
అతిథి అధ్యాపకులకు పీరియడ్ల వారీగా నెలసరి వేతనం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతవిద్యాశాఖ నిర్ణయించగా దసరా, సంక్రాంతి తదితర సెలవుల నేపథ్యంలో మాత్రం ఆ వేతనంలోంచి కోత విధిస్తున్నారు. పరీక్షల సమయంలోనూ వేతనం చేతికందదు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి అనేకమంది పేద బడుగు బలహీన వి ద్యార్థులకు డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రక్రియ చే పట్టడంలో అతిథి అధ్యాపకులదే కీలక పాత్ర. స మాన పనికి సమాన వేతనం పేరిట ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చేర్చి రూ.50వేలు, కన్సాలిడేటెడ్ పేగా ఉద్యోగ భద్రత కల్పించేందుకు హామీ ఇచ్చింది. ప్రస్తుతం హామీ నెరవేర్చడంలో జాప్యం జరుగుతోందని, తమ సేవలను గుర్తించడంలో అధికారులు తాత్సారం చేస్తున్నట్లు వారు వాపోతున్నారు.