
ఆటగాళ్లు ఆగమాగం
నిషేధం విధించిన కేంద్రం ఆడితే జైలు.. జరిమానా ఉమ్మడి జిల్లాలోనూ బాధితులు గేమింగ్ యాప్‌లు ఓపెన్ కాక ఆటగాళ్ల ఆగమాగం
మంచిర్యాలక్రైం: ఆకర్షించి.. అప్పుల పాలు చేసి ఆర్థికంగా దివాలా తీయిస్తున్న ఆన్‌లైన్ ఆటలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు–2025’ తీసుకొచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల ఉచ్చులో పడి బాలలు, యువత, మధ్య వయస్కుల వరకు ఎంతోమంది జీవితాలను అంధకారం చేసుకున్నారు. కొందరు ఆత్మహత్యకూ పాల్పడ్డారు. మరికొందరు ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలయ్యారు. రమ్మీ, సట్టా, ఫోకర్, కార్డ్‌గేమ్స్‌తోపాటు ఆన్‌లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఆన్‌లైన్ లాటరీ ఇలా డబ్బులు పెట్టి ఆన్‌లైన్‌లో ఆడే ఆటలు యువత జీవితాలను నట్టేట ముంచాయి. ఆన్‌లైన్ గేమ్స్, క్రికెట్ బెట్టింగ్‌కు బానిస కావడం వల్ల పలు కుటుంబాలు ఇబ్బందులకు గురయ్యాయి. ఇకపై ఆన్‌లైన్ గేమ్‌లు నిర్వహిస్తే మూడేళ్ల వరకు జైలు లేదా రూ.కోటి జరిమానా విధిస్తారు. కొన్నిసార్లు రెండు శిక్షలు విధిస్తారు. గేమ్‌లపై ప్రచారం చేసినా రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.50లక్షల జరిమానా విధిస్తారు. కొన్నిసార్లు రెండూ విధించవచ్చు.
పోగొట్టుకున్న డబ్బు సంపాదించాలని
ఇటీవల చెన్నూర్‌లోని బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేసే రవీందర్ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ. 40 లక్షలు పోగొట్టుకున్నాడు. ఎలాగైనా ఆ డబ్బు సంపాదించాలని బ్యాంకుకే టోకరా వేశాడు. బ్యాంకులో పనిచేసే కొందరితోపాటు తనకు తెలిసిన మ రికొందరి సహకారంతో బ్యాంకులో ప్రజలు తాక ట్టుపెట్టిన 25.17 కిలోల బంగారునగలు, రూ.1.10 కోట్ల నగదు గోల్‌మాల్ చేశాడు. బయటపడడంతో ముగ్గురు ఉద్యోగులు కటకటాల పాలయ్యారు.
ఆన్‌లైన్ గేమ్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో ఆటలకు బానిసగా మారిన వాళ్లు ఆగమాగం అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని కోల్‌బెల్ట్ ప్రాంతంలో అధికంగా యువత మొదలుకుని ఉన్నత స్థాయిలో ఉన్న వారు సైతం ఆన్‌లైన్‌లో రమ్మీ, క్రికెట్ బెట్టింగ్, మనీగేమింగ్‌లకు బానిసైన వారు ఉన్నారు. మద్యం సేవిస్తూ ఆటలు ఆడుతూ కాలం గడిపేవారు. ప్రస్తుతం గేమింగ్ యా ప్‌లు ఓపెన్ కాకపోవడంతో మతిస్థిమితం తప్పినట్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. పిచ్చిలేస్తుందని, మైండ్ పని చేయడం లేదంటూ యువత వింతగా ప్రవర్తిస్తున్నట్లు తెలి సింది. మరికొందరు పేకాట వైపు వెళ్తున్నట్లు సమాచారం. శ్రీరాంపూర్‌కు చెందిన ఓ సింగరేణి ఉద్యోగి బ్యాంకు ఖాతాలోకి ఆన్‌లైన్ ద్వారా ఒక్క రోజులోనే 28 సార్లు బదిలీలు జరిగాయి. దీంతో బ్యాంకు అధికారులు ఖాతాను నిలిపి వేసి పిలిపించారు. ఇలా బ్యాంకు అధికారులు సైతం అధికంగా ఆన్‌లైన్‌లో పలుమార్లు డబ్బు బదిలీ జరిగే ఖాతాలపై దృష్టి సారించినట్లు సమాచారం.
మంచిర్యాలలోని రెడ్డికాలనీకి చెందిన ఇప్ప వెంకటేష్(40) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబంతో జీవనం సాగించేవాడు. 2024 సెప్టెంబర్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై రూ.25లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చేందుకు లోన్ యాప్‌ల ద్వారా రుణం తీసుకున్నాడు. లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక భార్య వర్షిణి(33), ఇద్దరు కుమారులు రిషికాంత్(11), విహాంత్(3)లను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.