
రెవెన్యూ శాఖలో పనులు త్వరగా పూర్తి చేయాలి
దండేపల్లి/జన్నారం: రెవెన్యూ శాఖలో పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. శుక్రవారం ఆయన దండేపల్లి, జన్నారం మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తగా విధుల్లో చేరిన గ్రామ పాలనాధికారులతో మాట్లాడారు. విధుల్లో అవకతవకలకు పాల్పడకుండా సక్రమంగా నిర్వర్తించి మంచి పేరుతెచ్చుకోవాలని అన్నారు. భూభారతి దరఖాస్తులు వివరాలు తెలుసుకున్నారు. సాదాబైనామాల దరఖాస్తుల పరిశీలన, నోటీసుల జారీ తదితర పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో దండేపల్లి డీటీ మాధవి, ఆర్‌ఐ భూమన్న, జన్నారం తహసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, డీటీ రామ్మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.