
అమ్మ పేరిట మొక్క.. పచ్చదనం పక్కా
నిర్మల్‌ఖిల్లా: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, ‘ఏక్ పేడ్ మాకే నామ్ పే’ పేరుతో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట ఒక మొక్క నాటాలనే కార్యక్రమాన్ని విరివిగా చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమష్టిగా పాల్గొని పాఠశాల ఆవరణలతోపాటు గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో జిల్లా విద్యాశాఖ కృషి చేస్తోంది.
ప్రత్యేక కార్యాచరణ..
కార్యక్రమం అమలు కోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించింది. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, తల్లి పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించింది. ఈ కార్యక్రమం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నారు. నాటిన మొక్కలను పరిరక్షించేందుకు కూడా తగిన కార్యాచరణ చేపడుతున్నారు.
సమష్టిగా..
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమష్టిగా పాల్గొంటే ఉమ్మడి జిల్లాలో దాదాపు 5 లక్షలకు పైగా మొక్కలు నాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొక్కలు గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆధ్వర్యంలో పంపిణీకి అందుబాటులో ఉన్నాయని నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు.
మొక్క నాటి.. పోర్టల్‌లో అప్‌లోడ్..
తల్లి పేరిట మొక్క నాటిన సందర్భంలో విద్యార్థులు ఫొటో తీసి, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని www. ecoclubs. eduvation. gov. in పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ పోర్టల్‌లో పాఠశాల వివరాలు, యుడైస్ కోడ్, విద్యార్థి పేరు, తండ్రి పేరు వంటి వివరాలను నమోదు చేసి, మొక్క నాటే సమయంలో తీసిన ఫొటోను జతచేయడం ద్వారా విద్యార్థి పేరిట ధ్రువీకరణ పత్రం, ప్రశంసాపత్రం జనరేట్ అవుతుంది.
పర్యావరణ పరిరక్షణ..
ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల ఆవరణలు, గ్రామాలు పచ్చదనంతో కళకళలాడనున్నాయి. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరగడంతోపాటు, సమాజంలో పచ్చదనం విస్తరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా పాఠశాలలు విద్యార్థుల సంఖ్య
నిర్మల్ 842 1,12,300
ఆదిలాబాద్ 1,279 1,23,900
మంచిర్యాల 847 1,05,600
కుమరంభీమ్ 1,148 1,18,200

అమ్మ పేరిట మొక్క.. పచ్చదనం పక్కా