
సొంతింటిపై అభిప్రాయ సేకరణ
శ్రీరాంపూర్: కార్మికులకు సొంతిల్లు కావాలా..? కంపెనీ క్వార్టర్ కావాలా..? అనే అంశంపై సీఐటీయూ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. కంపెనీ వ్యాప్తంగా రెండు రోజులపాటు చేపడుతున్న కార్యక్రమంలో తొలిరోజు గురువారం భూగర్భ గనుల్లో బ్యాలెట్ పద్ధతిలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. శ్రీరాంపూర్‌లోని భూగర్భ గనులపై ఈ కార్యక్రమాలు జరిగాయి. ఆర్కే 7, ఆర్కే న్యూటెక్ గనిపై జరిగిన కార్యక్రమానికి ఆ యూనియన్ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్మికులు ఈ అంశంపై బ్యాలెట్ పేపర్‌పై టిక్ చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలన్నారు. మీడియా సమక్షంలో లెక్కించి దాని ఆధారంగా యజమాన్యానికి రిపోర్ట్ ఇస్తామని తెలిపారు. యూనియన్ బ్రాంచి అధ్యక్షుడు గుల్ల బాలాజీ, కోశాధికారి కస్తూరి చంద్రశేఖర్, నాయకులు వెంగళ శ్రీనివాస్, సాయిల శ్రీనివాస్, తిరుపతి, బానేష్, శ్రీధర్, తోడే సుధాకర్, నవీన్, పెరిక సదానందం తదితరులు పాల్గొన్నారు.