
కాలువలో పడి బాలుడి మృతి
నిర్మల్‌రూరల్: మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన బత్తుల జయరాజ్ (12) ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఆయన కథనం ప్రకారం..బుధవారం మధ్యాహ్నం తల్లి బత్తుల లతీకతో కలిసి తోటకు కూలీ పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం అందరితో కలిసి భోజనం చేసిన తర్వాత పక్కనే ఉన్న కెనాల్‌లో ఆడుకోవడానికి వెళ్లాడు. ఆ సమయంలో భారీ వర్షం పడడంతో ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయాడు. చాలాసేపటి తర్వాత గమనించిన తల్లి, గ్రామస్తులు జయరాజు కోసం వెతకగా కాలువలో ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్సై, సిబ్బంది కాలువలో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. జయరాజ్ తండ్రి గత కరోనాలో మృతిచెందగా, తల్లి కూలీ చేసుకుంటూ బతుకుతోంది. కాగా జయరాజుకు మానసిక స్థితి సరిగాలేదని, ఇంట్లోనే ఉంటాడని రూరల్ ఎస్సై పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.