
అటవీభూములు ఆక్రమిస్తే చర్యలు
దండేపల్లి: అటవీ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని జన్నారం ఎఫ్‌డీవో రామ్మోహన్ హెచ్చరించారు. మండలంలోని లింగాపూర్ అ టవీ బీట్‌లోని 380 కంపార్ట్‌మెంట్‌లో ఐదారు రోజులుగా సమీప గ్రామాల గిరిజనులు, నిరుపేదలు అటవీ భూముల ఆక్రమణకు ప్రయత్నిస్తూ చెట్ల పొదలు తొలగిస్తున్నారు. ఫారెస్ట్, పోలీస్ అధికారులు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. శనివారం అదే ప్రాంతంలో గిరి జనులు, పేదలు, చెట్ల పొదలు తొలగించారు. విషయం తెలుసుకున్న ఎఫ్‌డీవో, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి తహసీల్దార్ రో హిత్ దేశ్‌పాండే, ఎస్సై తహసినొద్దీన్‌తో కలిసి అక్కడికి చేరుకున్నారు. గిరిజనులు, పేదలతో మాట్లాడారు. అటవీ భూములను ఆక్రమించుకోవడం, వాటికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం సరికాదని తెలిపారు. అటవీ భూముల్లో చెట్లు, పొదలు తొలగిస్తే అటవీ హక్కుల చ ట్టంతో పాటు వన్యప్రాణుల చట్టాలను ఉపయోగించి చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. ఈక్రమంలో కొందరు గి రిజన మహిళలు ఎఫ్‌డీవో, తహసీల్దార్ కాళ్లపై పడి తమకు భూములు కేటాయించి పట్టాలివ్వాలని వేడుకున్నారు. ఆయన వెంట తాళ్లపేట అటవీ రేంజ్ సిబ్బంది ఉన్నారు.