
ఆర్జీయూకేటీలో అకడమిక్ రివ్యూ మీటింగ్
బాసర: బాసర ఆర్జీయూకేటీలో 2025–26 విద్యాసంవత్సరాన్ని పురస్కరించుకుని సోమవారం అకడమిక్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, ఓఎస్‌డి ప్రొఫెసర్ ఈ. మురళీదర్శన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థుల హాజరు, రిజిస్టర్ల నిర్వహణ, డేటా భద్రతపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్‌ఏఏసీ ఫైల్ తయారీపై అన్ని శాఖల అధ్యాపకులు శ్రద్ధ వహించాలని సూచించారు. త్వరలో (ఎంటెక్)పీహెచ్‌డీ ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. బాసర, మహబూబ్ నగర్ సెంటర్లకు సంబంధించిన ప్రవేశ ఫలితాలు విడుదల జూలై 4న, జూలై 7, 8, 9 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఫలితాలను మొదటిగా విడుదల చేసిన విశ్వవిద్యాలయంగా బాసర ఆర్జీయూకేటీ నిలిచిందన్నారు. ఇందులో భాగమైన టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డీన్లు డాక్టర్ మహేష్, డాక్టర్ విట్టల్, డాక్టర్ నాగరాజు, అన్ని విభాగాల హెచ్‌ఓడీలు, పీఆర్‌వో విజయ్ కుమార్, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
సాంస్కృతికశాఖ సలహామండలి సభ్యుడిగా నాగరాజు
మందమర్రి రూరల్: మందమర్రి పట్టణానికి చెందిన ధూంధాం సాంస్కృతిక విభాగం వ్యవస్థాపకుడు అంతడ్పుల నాగరాజును తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యుడిగా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ సాంస్కృతిక మండలి సలహాదారుగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. పలువురు కళాకారులు నాగరాజును అభినందించారు.
‘9న సమ్మె విజయవంతం చేయాలి’
శ్రీరాంపూర్: జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం నస్పూర్ కాలనీలోని జీటీ హాస్టల్ వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను మోడీ సర్కార్ కాలరాస్తుందన్నారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చి కార్మిక హక్కులను హరిస్తోందన్నారు. ఈ సమ్మెతో కేంద్రానికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ముస్కే సమ్మయ్య, బాజీ సైదా, కిషన్ రావు, కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, బండి రమేశ్, చంద్రశేఖర్, వెంగళ శ్రీనివాస్, కిషన్ రెడ్డి, కాంతయ్య, సత్యం, కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌ఎంఎస్ సమ్మె నోటీసు
జూలై 9న జరుపతలపెట్టిన సార్వత్రిక సమ్మెకు సంబంధించిన నోటీసును హెచ్‌ఎంఎస్ నాయకులు శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్‌కు అందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ కేంద్ర నాయకులు తిప్పారపు సారయ్య, ఉపాధ్యక్షుడు అనిల్‌రెడ్డి, అశోక్, గొల్ల్ల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఆర్జీయూకేటీలో అకడమిక్ రివ్యూ మీటింగ్

ఆర్జీయూకేటీలో అకడమిక్ రివ్యూ మీటింగ్