
సఫారీకి సెలవు
● జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నిలిపివేత ● అక్టోబర్ నుంచి పునఃప్రారంభం
మూణ్నెళ్లు బంద్‌చేస్తాం
ఎన్‌టీసీఏ సూచనల ప్రకారం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మూడు నెలలపాటు సఫారీ ప్రయాణం బంద్ చేయడం జరుగుతోంది. వర్షాల కారణంగా అడవిలో బురదలో వాహనాలు కూరుకుపోయి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అక్టోబర్‌లో తిరిగి అనుమతులు ఇస్తాం. పర్యాటకులు గమనించాలి.
– రామ్మోహన్, ఎఫ్‌డీవో
జన్నారం: కవ్వాల్ అభయారణ్యంలోని జన్నారం అటవీ డివిజన్‌లో జంగల్ సఫారీకి అటవీశాఖ మూడు నెలలపాటు సెలవు ప్రకటించింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నిలిపివేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పచ్చదనం పంచుతున్న అడవి అందాలను తిలకించేందుకు పర్యాటకశాఖ జన్నారంలో హరిత రిసార్ట్‌లు ఏర్పాటు చేయగా పర్యాటకశాఖ రెండు సఫారీలు, అటవీశాఖ ఐదు సఫారీలు ఏర్పాటు చేశారు. జన్నారం వచ్చిన పర్యాటకులు సఫారీ ద్వారా దట్టమైన అడవిలోనికి వెళ్లి పచ్చని చెట్ల నడుమ పర్యటించడం వల్ల ఆహ్లాదం పొందుతున్నారు. అడవుల అందాలను, వన్యప్రాణుల పరుగులను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
మూడు నెలలపాటు నిలిపివేత
అడవుల అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు మూడు నెలల పాటు సఫారీ ప్రయాణానికి అనుమతి లేదు. ఎందుకంటే వర్షాకాలంలో వన్యప్రాణులు ఎదకు వచ్చి బయట విచ్చలవిడిగా తిరుగుతాయి. సఫారీ ప్రయాణంతో వాటికి ఆటంకం కలుగుతుంది. వన్యప్రాణుల స్వేచ్ఛకు భంగం కలిగించవద్దనే ఉద్దేశంతో మూడు నెలలు (జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు) అనుమతులు నిరాకరిస్తూ అటవీశాఖ అధికారులు పర్యాటకశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు.