
రెండోరోజూ బాధితుల ఆందోళన
పెంచికల్‌పేట్: అగర్‌గూడ గ్రామానికి చెందిన తుమ్మిడే రాజశేఖర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఎల్కపల్లిలోని రాచకొండ కృష్ణ ఇంటి ఎదుట గ్రామస్తులు చేపట్టిన ఆందోళన బుధవారం రెండో రోజుకు చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్‌ఎస్ నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, బీజేపీ నాయకుడు పాల్వాయి సుధాకర్ రావు, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ మృతుని కుటుంబానికి తనవంతుగా రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తానని హామి ఇచ్చారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు చేసిన మానసిక వేధింపులతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఎరువుల దుకాణాల్లో విజిలెన్సు తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ జెడ్పీటీసీ పాల్వాయి సుధాకర్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ లైసెన్సు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేశ్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఽఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అద్యక్షుడు కోట సతీశ్, ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జైరాం కోరారు. మృతికి సంతాపంగా మండల కేంద్రంలోని వ్యాపార సముదాయాలు బంద్ పాటించారు. కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో కాగజ్‌నగర్ రూరల్, కౌటాల సీఐ శ్రీనివాసరావు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిందితుడి అరెస్టు..
అగర్‌గూడ గ్రామానికి చెందిన రాజశేఖర్ ఆత్మహత్యకు కారణమైన ఎల్కపల్లి గ్రామానికి చెందిన రాచకొండ కృష్ణను హైదరాబాద్‌లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పెంచికల్‌పేట్ ఎస్సై కొమురయ్య తెలిపారు.
విషాదంలో అగర్‌గూడ..
గ్రామంలో అందిరితో కలిసి మెలిసి ఉండే రాజశేఖర్ ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుని తండ్రి శ్రీనివాస్ మూడేళ్ల క్రితం చనిపోయాడు. చేతికి అందివచ్చిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడంతో తల్లి లక్ష్మీ రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.