
స్మార్ట్ బజార్
● నెట్టింట్లో ఆర్డర్.. నట్టింటికే సరుకులు ● మార్కెటింగ్ రంగంలో ఆధునిక విప్లవం.. ● విస్తరిస్తున్న ఆన్‌లైన్ మార్కెట్.. ● ఉమ్మడి జిల్లాలో విస్తరిస్తున్న ఈ–కామర్స్ ● నేడు ప్రపంచ మార్కెటింగ్ దినోత్సవం
నిర్మల్‌ఖిల్లా: ప్రస్తుత మార్కెటింగ్ రంగం రోజు రోజుకూ కొత్త ఒరవడిని సంతరించుకుంటూ విని యోగదారులను ఆకర్షిస్తోంది. గతంలో షాపింగ్ కోసం మార్కెట్‌కు వెళ్లి వస్తువులు కొనుగోలు చేసే సంప్రదాయం ఉండేది. కానీ, నేడు ఈ–కామర్స్ సంస్థలు ఇంటి నుంచి అడుగు బయటపెట్టకుండానే నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్ ఉపకరణాల వరకు అన్నింటినీ ఇంటికి చేర్చే సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. మంగళవారం ప్రపంచ మార్కెటింగ్ దినోత్సవం సందర్భంగా ఈ–కామర్స్ సంస్కృతిపై ప్రత్యేక కథనం.
ఆన్‌లైన్ షాపింగ్ జోరు
గతంలో నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఆన్‌లైన్ కొనుగోళ్లు ఇప్పుడు గ్రామాలు, మారుమూల తండాలకు విస్తరించాయి. నిత్యావసరాలు, బట్టలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పాదరక్షలు అన్నీ మొబైల్ ద్వారా ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకుంటున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ సౌ లభ్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ– కామ ర్స్ సంస్థల విస్తృత నెట్‌వర్క్, సులభమైన డెలివరీ వ్యవస్థ ఈ ట్రెండ్‌ను వేగవంతం చేసింది.
ఉపాధి అవకాశాలు
ఉమ్మడి జిల్లాలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి సంస్థలు ఏజెన్సీలు, కొరియర్ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. స్థానిక యువత డెలివరీ సిబ్బందిగా ఉపాధి పొందుతూ వినియోగదారులకు నేరుగా వస్తువులను అందజేస్తున్నారు. ఈ వ్యవస్థ గ్రా మీణప్రాంతాలకు కూడా సేవలను అందిస్తూ స్థాని క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ‘స్మార్ట్ నిర్మల్’యాప్ ద్వారా నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్‌ను జిల్లావాసులు ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్ల సమన్వయంతో శాఖాహార, మాంసాహార ఐటమ్స్‌ను సిబ్బంది నేరుగా ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నారు. కాగా, ఆన్‌లైన్‌లో వస్తువుల కొనుగోలుతో స్థానిక వ్యాపారులకు కొంత నష్టం జరుగుతుందని, వారిని ప్రోత్సహించాలని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
యువత ఆధిపత్యం
మొబైల్ ఫోన్‌ను విరివిగా వినియోగించే యువత ఈ–కామర్స్ సేవలను ఎక్కువగా ఉపయోగిస్తోంది. ఫ్యాషన్ వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి ఆహార పదార్థాల వరకు వారు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. గృహిణులు కూడా నిత్యావసరాలు, బట్టలు, గృహ సామాగ్రి కొనుగోలుకు ఈ–కామర్స్ వేదికలను ఆశ్రయిస్తున్నారు. ఆన్‌లైన్ కొనుగోళ్లలో తప్పుడు వెబ్‌సైట్‌లు, మోసపూరిత లావాదేవీల నుంచి జాగ్రత్తగా ఉండాలి. విశ్వసనీయ సంస్థలను ఎంచుకోవడం, ముందస్తు చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. పిన్‌కోడ్, చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాలను సురక్షిత వెబ్‌సైట్లలోనే నమోదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
బయటకు వెళ్లలేకనే..
బయటకు వెళ్లి షాపింగ్ చేసే సమయం లేదు. ఇంట్లో ఉండి నిత్యావసరాలు తదితర వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తుంటాను. డెలివరీ తర్వాత వస్తువు డ్యామేజ్ ఉన్నా రిటర్న్ చేసే అవకాశం ఉంది. కాలానికనుగుణంగా ఈ కామర్స్ షాపింగ్ మంచి వేదికగా మారుతోంది. – లక్ష్మీనర్సింహారెడ్డి,
ప్రభుత్వ ఉద్యోగి, నిర్మల్
స్థానిక మార్కెట్‌పై ప్రభావం
అరచేతిలో సెల్‌ఫోన్ ఉండడంతో ఆన్‌లైన్ షాపింగ్‌కు ఆసక్తి పెరుగుతోంది. ఈ కామర్స్ వ్యాపారం క్రమంగా పల్లెలకు విస్తరించడంతో స్థానిక మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిర్మల్ మార్కెట్ ప్రస్తుతం పండుగ సీజన్లో వెలవెలబోతోంది. స్థానిక వ్యాపారులకు వర్తకం జరిగేలా ప్రోత్సహించాలి.
– పోల దయాకర్, వస్త్ర వ్యాపారి, నిర్మల్

స్మార్ట్ బజార్

స్మార్ట్ బజార్