
‘ఉపాధి’పై విజిలెన్స్
● పనుల్లో పారదర్శకత కోసం పర్యవేక్షణ కమిటీలు ● గ్రామస్థాయిలోనే అక్రమాలకు చెక్..
పాతమంచిర్యాల: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి హమీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఆర్థిక బలోపేతం చేస్తోంది. పనులలో పారదర్శకత, నాణ్యతను నిర్ధారించేందుకు 2025 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతీ గ్రామ పంచాయతీలో విజిలెన్స్ మానిటరింగ్ కమి టీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి.
విజిలెన్స్ కమిటీలు..
ఉపాధి పనుల పర్యవేక్షణకు వేసే ఈ కమిటీలను గ్రామసభల ద్వారా ఎంపికై న ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేస్తారు. కమిటీలో మూడింట ఒక వంతు మహిళల భాగస్వామ్యం తప్పనిసరి. ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, యువజన సంఘాలు లేదా స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఇందులో ఉంటారు. ఈ కమిటీల కాలపరిమితి ఆరు నెలలు, సభ్యులు స్వచ్ఛందంగా ఎలాంటి వేతనం లేకుండా పనిచేస్తారు. గత నెలలో ఏర్పాటు ప్రారంభమై, మే రెండవ వారంలో జిల్లాలోని 16 మండలాల్లోని గ్రామ పంచాయతీలలో కమిటీలు ఏర్పాటు చేశారు.
కమిటీల విధులు, బాధ్యతలు
ప్రతీవారం గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే ఉపాధి పనులను కమిటీలు సమీక్షిస్తాయి. పని స్థలాలను సందర్శించి, కూలీలతో సంప్రదించి, సౌకర్యాలు, నాణ్యత, వేతన చెల్లింపులు, పనుల పరిమాణం వంటి అంశాలను పరిశీలిస్తాయి. నెలవారీ నివేదికలను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పిస్తాయి. సమస్యల పరిష్కారానికి అధికారులకు సిఫారసులు చేస్తాయి. సామాజిక తనిఖీలలో కమిటీ నివేదికలను పరిగణనలోకి తీసుకుంటారు.
పారదర్శకతకు కేంద్రం మార్గదర్శకాలు
అవకతవకలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. విజిలెన్స్ కమిటీలు గ్రామీణ ఉపాధి పథకంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు.
పారదర్శకత పెంచడానికే..
ఉపాధి హామీ పనులలో పారదర్శకత పెంచడానికి విజిలెన్సు మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేశాం. గ్రామపంచాయతీ స్థాయిలో ఏర్పాటైన కమిటీలు గ్రామాభివృద్దికి అవసరమైన పనుల ఎంపిక, చేపట్టిన పనులు పరిశీలన, పనులలో అవకతవకలు నిరోధించేలా పనిచేస్తాయి.
– ఎస్.కిషన్, డీఆర్డీవో
జిల్లా వివరాలు..
జాబ్‌కార్డులు 1,02,119
కూలీలు 2,37,449
యాక్టివ్ జాబ్‌కార్డులు 77,586
యాక్టివ్ కూలీలు 1,32,245
గ్రామపంచాయతీలు 305

‘ఉపాధి’పై విజిలెన్స్