
అటవీ అనుమతులకు ప్రత్యేక చర్యలు
● గిరిజనుల అభివృద్ధికి కృషి ● రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ
మంచిర్యాలఅగ్రికల్చర్: అభివృద్ది పనులకు అవసరమైన అటవీ అనుమతుల జారీకి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ, పర్యావరణ, అటవీ, శాస్త్రసాంకేతిక శాఖ కార్యదర్శి అహ్మద్ నదీంతో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొండా సురేఖ మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, తాగునీటి సరఫరా, విద్యుత్, పాఠశాలలు, ఆస్పత్రులు ఇతర అభివృద్ధి పనుల కోసం సమర్పించిన ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల పరిధిలో చేపట్టే రహదారుల పనులకు అటవీ శాఖ అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో అటవీ నిబంధనలకు లోబడి అనుమతులు జారీ చేయాలన్నారు. అవసరమైతే అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో పనుల జరిగేలా చూడాలని తెలిపారు. పనుల పురోగతిపై ఈనెల 28లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు.
అభివృద్ధిలో వెనుకబాటు..
ప్రస్తుతం సమాజంతో పొలిస్తే అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు అభివృద్ధిలో వెనకబడ్డారని మంత్రి సీతక్క అన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రహదారుల నిర్మాణం, విస్తరణ, జాతీయ రహదారులకు అనుసంధానం ద్వారా మారుమూల గిరిజనులకు, బాహ్య ప్రపంచానికి సంబంధాలు మెరుగు పడతాయని పేర్కొన్నారు.
పోడు వ్యవసాయానికి తోడ్పాటు..
జిల్లాలోని పోడు భూములలో వెదురు మొక్కల పెంపకంపై గిరిజనలకు అవగాహన కల్పించి సాగు చేసేలా తోడ్పాటు అందిస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నర్సరీలలో వెదురు మొక్కలు పెంచుతున్నామని జిల్లాలో కొన్నేళ్లుగా పట్టుపురుగలు పెంచుతున్నట్లు వెల్లడించారు. మట్టి రోడ్లను సీసీ, బీటీ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంద ని, ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.