
రైతుల సేంద్రియ బాట
● లోపాలను అధిగమించేలా వినూత్న పద్ధతులు ● పొలాల్లో గొర్రెలు, మేక మందలు..
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/దండేపల్లి: ఆధునిక వ్యవసాయంలో పెట్టుబడులు విపరీతంగా పెరిగింది. ఇదే సమయంలో భూసారం గణనీయంగా తగ్గుతోంది. ఫలితంగా పంట దిగుబడులు తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పాడి పశువుల సంఖ్య తగ్గడంతో సేంద్రీయ ఎరువు లభ్యత తగ్గిన నేపథ్యంలో సేంద్రియ ఎరువులు దొరకడం లేదు. దీంతో రసాయన ఎరువులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో లోపాలు, ఆర్థిక నష్టాలను అధిగమించేందుకు మళ్లీ రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గుచూపుతున్నారు.
గొర్రెలతో వినూత్న ఎరువు సేకరణ
రైతులు గొర్రెలు, మేకలను ఉపయోగించి సేంద్రీయ ఎరువు సమకూర్చుకుంటున్నారు. గతంలో యాదవులకు పంపిణీ చేసిన గొర్రెలను రాత్రిపూట పొలాల్లో మందలు పెడుతున్నారు. ఇందుకు ఎకరాకు రూ.2 వేల నుంచి రూ.2,500 వెచ్చించి సేంద్రీయ ఎరువు సేకరిస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో ఒక రాత్రిలో 800 గొర్రెలు లేదా మేకల మందను ఉంచితే ఏడాదికి సరిపడా ఎరువు, పంటలకు అవసరమైన పోషకాలు లభిస్తాయంటున్నారు.
భూసారం పెంపొందేలా..
గొర్రెల పేడ, మూత్రం, వెంట్రుకల ద్వారా భూమికి నత్రజని (3–13 గ్రాములు/లీటర్ మూత్రం), పొటాషియం (18–20 గ్రాములు), పాస్పరస్ వంటి సేంద్రీయ పదార్థాలు అందుతాయి. గొర్రె పేడలోని పీచు పదార్థం మొక్కల వేర్లు సులభంగా ఎదిగేలా చేస్తుందని దండేపల్లి ఏఈవో మౌనిక తెలిపారు. ఒక రాత్రి విసర్జించే లీటరు మూత్రం భూమిలో తేమను నిలుపుతుంది. ఒక్కసారి ఎరువు కోసం పెట్టుబడి పెడితే మూడేళ్ల వరకు ఎరువు అవసరం లేదని రైతులు చెబుతున్నారు.
సారవంతమైన భవిష్యత్తు
గొర్రెల ద్వారా నత్రజని, భాస్వరం, పొటాష్‌తో పాటు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు భూమికి అందుతున్నాయి. ఈ వినూత్న పద్ధతితో తక్కువ ఖర్చుతో భూసారం పెరిగి, రైతులు సేంద్రీయ వ్యవసాయంలో లాభాలు ఆర్జిస్తున్నారు.