
అంగన్‌వాడీ కేంద్రంలో చోరీ
కోటపల్లి: మండలంలోని రోయ్యపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో చోరీ జరిగింది. శనివారం ఉదయం కేంద్రం తలుపులు పగులకొట్టి ఉండటంతో స్థానికులు నిర్వాహకురాలు విజయలక్ష్మికి సమాచారం అందించారు. ఆమె అక్కడికి వచ్చి చూడగా కేంద్రంలో 17 పాల ప్యాకెట్లు, 10 పప్పు ప్యాకెట్లు, 5 ట్రేల కోడిగుడ్లను గుర్తుతెలియని దుండుగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాలేజీరోడ్‌లో..
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్‌లో ఈనెల 22న చోరీ జరిగినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కాలేజీరోడ్‌కు చెందిన ముక్తా ప్రసాద్ జైపూర్ మండలం ఇందారంలో రేషన్ షాపులో పనిచేసేవాడు. ప్రసాద్ ప్రతీ రోజు ఉదయం ఇందారం వెళ్లి సాయంత్రం వచ్చేవాడు. ఈనెల 21న ప్రసాద్ భార్య ఇంటికి తాళం వేసి బయటకు వెళ్తూ పక్కనే ఉన్న చందా ప్రసన్నలక్ష్మికి తాళం చెవి ఇచ్చింది. ఈనెల 22న ఉదయం ఇంట్లో బీరువాలో 120 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. సుమారు వీటి విలువ రూ.7.20 లక్షలు ఉంటుందన్నారు. ప్రసన్నలక్ష్మి, మరో వ్యక్తిపై అనుమానం ఉందని బాధితుడు ప్రసాద్ ఫిర్యాదుతో శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.