
20 క్వింటాళ్ల నకిలీ పత్తివిత్తనాలు పట్టివేత
కాగజ్‌నగర్‌రూరల్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రూ.60 లక్షల విలువైన 20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కాగజ్‌నగర్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ డీవీ.శ్రీనివాస్‌రావు శనివారం వివరాలు వెల్లడించారు. నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో కాగజ్‌నగర్ సమీపంలోని పెద్దవాగు సమీపంలో తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో అటుగా వచ్చిన ఏపీ39 టీవై 9741 నంబర్ ఐచర్ వ్యాన్‌ను తనిఖీ చేయగా అందులో 20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు గుర్తించారు. విత్తనాలకు సంబంధించిన వివరాలు తెలుపకపోవడంతో కాగజ్‌నగర్ పట్టణంలోని కాపువాడకు చెందిన కొత్తపల్లి సదాశివ్, కర్నూల్ జిల్లా అదోనికి చెందిన డ్రైవర్ పుప్పాల లక్ష్మణ్, మహారాష్ట్రలోని అహేరికి చెందిన సంతోష్‌కిశోర్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరో నిందితుడు వేణుగోపాల్‌రెడ్డి పరారీలో ఉన్నారని తెలిపారు. జిల్లాలో ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం, టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్, కాగజ్‌నగర్‌రూరల్ సీఐ శ్రీనివాస్‌రావు, టాస్క్‌ఫోర్స్ ఎస్సై వెంకటేశ్, రూరల్ ఎస్సై సందీప్ పాల్గొన్నారు.
ఇచ్చోడ: మండలంలోని కోకస్‌మన్నూర్, ఇస్లాంనగర్ గ్రామాల్లో ఆదిలాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆధ్వర్యంలో శనివారం నకిలీ విత్తనాలు పట్టుకున్నట్లు తెలిసింది. ఉదయం 8 గంటలకు ఏకకాలంలో దాడులు నిర్వహించి నకిలీ బీజీ–3 విత్తనాలను పట్టుకున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో 18 నకిలీ విత్తనాల బ్యాగులతో పాటు ముగ్గురిని అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై స్థానిక ఎస్సై పురుషోత్తం వివరణ కోరగా ఆకస్మికంగా దాడులు జరిపిన మాట వాస్తవమన్నారు. విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.