
నడుమునొప్పి భరించలేక ఆత్మహత్య
తానూరు: నడుమునొప్పి భరించలేక యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఎస్సై భానుప్రసాద్ కథనం ప్రకారం.. మండలంలోని వడ్‌ఝరి(బి) గ్రామానికి చెందిన గరికే లక్ష్మణ్ (29) రెండేళ్లుగా నడుమునొప్పితో బాధపడుతున్నాడు. గతేడాది శస్త్రచికిత్స చేయించుకున్నా నయం కాలేదు. ఆ తర్వాత వ్యవసాయ పనులు చేస్తుండగా కట్ల పాము కాటేసింది. కాళ్లవాపు తగ్గలేదు. వైద్య పరీక్షలు నిర్వహించుకోగా వ్యాధి నయం కాలేదు. అటు నడుమునొప్పి, ఇటు కాళ్లవాపు తగ్గకపోవడం తీవ్ర మనస్తాపంతో శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. రాత్రయినా లక్ష్మణ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి బాలాజీ వెతుకుంటూ వ్యవసాయ పొలానికి వెళ్లాడు. అక్కడ స్పృహా కోల్పోయిన లక్ష్మణ్‌ను భైంసా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. భార్య నాగమణి ఫిర్యాదుతో శనివారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
పాముకాటుకు
మధ్యప్రదేశ్‌వాసి మృతి
తాండూర్: పాముకాటుకు మధ్యప్రదేశ్ వాసి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వర్కడే విష్ణుప్రసాద్ (52) బతుకుదెరువు కోసం తాండూర్ మండలం రేపల్లెవాడకు వలసవచ్చాడు. ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులో కూలీ పనులు చేస్తూ రేపల్లెవాడలో అద్దెకు ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రించిన విష్ణుప్రసాద్ శనివారం తెల్లారేసరికి పాముకాటుకు గురై మృతి చెంది ఉన్నాడు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి సోదరుడు మాన్‌సింగ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

నడుమునొప్పి భరించలేక ఆత్మహత్య