
గడ్డంగూడలో ఉద్రిక్తత
● గుడిసెల తొలగింపునకు అటవీ అధికారుల యత్నం ● ఎదురు తిరిగిన గిరిజనులు ● నలుగురిపై దాడి..
జన్నారం: జన్నారం అటవీరేంజ్ పరిధిలోని గడ్డంగూడలో గిరిజనులు వేసుకున్న గుడిసెల తొలగింపు విషయంలో అటవీ అధికారులు, గిరిజనుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు అటవీ అధికారులు గుడిసెలను తొలగించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గడ్డంగూడలోని అటవీ భూమిలో గిరిజనులు కొన్నేళ్లుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. అటవీఅధికారులు ఈ గుడిసెలను తొలగిస్తుండగా, గిరిజనులు తిరిగి వేసుకోవడం ఆనవాయితీగా మారింది. రెండు నెలల క్రితం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు రాత్రివేళ గుడిసెలు తొలగించారు. గిరిజనులు మళ్లీ గుడిసెలు నిర్మించుకున్నారు. ఈనెల 15న ఎఫ్‌డీపీటీ శాంతరాం ఈ ప్రాంతాన్ని సందర్శించారు. గుడిసెలు కనిపించడంతో బీట్ అధికారి శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. డీఆర్వోకు మెమో జారీ చేసిన ఐదు రోజులకే ఆయనను కూడా కూడా సస్పెండ్ చేశారు.
గిరిజనుల ఆగ్రహం..
ఉన్నతాధికారుల ఆదేశాలతో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు జన్నారం అటవీ డివిజన్ సి బ్బంది గడ్డంగూడలో గుడిసెలను తొలగించేందుకు వెళ్లారు. వాహనాల శబ్దం విని బయటకు వచ్చిన గిరిజనులు, తొలగింపు ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ‘సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నామని, మమ్మల్ని ఎలా వెళ్లగొడతారు?.. చావనైనా చస్తాం, కానీ ఇక్కడి నుంచి కదలము’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ భూమిలో నివసించడం చట్టవిరుద్ధమని, గుడిసెలు ఖాళీ చేయాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు. ఈ సందర్భంలో ఉద్రిక్తత నెలకొని తోపులాట జరిగింది. ఎఫ్‌ఎస్‌వో కృష్ణారావు, బీట్ అధికారులు లాలుబాయి, తిరుమలేశ్, వెంకటకృష్ణపై గిరిజనులు దాడి చేసి గాయపరిచినట్లు రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. గిరిజనుల ఎదురుతిరుగుడుతో అధికారులు వెనుదిరిగారు.
డీఎఫ్‌వో అత్యవసర సమావేశం..
గడ్డంగూడ గుడిసెల తొలగింపు విషయంలో మంచిర్యాల డీఎఫ్‌వో శివ ఆశిష్ సింగ్, రేంజ్ అధికారులు సుష్మారావు, కారం శ్రీనివాస్‌లతోపాటు సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమస్యపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవహరించాలని సూచించారు. గిరిజనుల దాడిని ఖండిస్తూ, నలుగురు అటవి సిబ్బందిపై దాడి చేసిన వారిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సుష్మారావు వెల్లడించారు.