
మార్కెట్ రోడ్ల అభివృద్ధికి రూ.78 కోట్లు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ రోడ్ల విస్తరణ, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టంతోపాటు సెంట్రల్ లైటింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇందుకు రూ.78 కోట్లు మంజూరు చేసింది. దీంతో జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఎంతగానో కృషి చేస్తూ, అవసరమైన నిధులను తీసుకువస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అనాలోచిత నిర్ణయాలతో మంచిర్యాల నియోజకవర్గం 30 ఏళ్లు వెనుకబడిందని పేర్కొన్నారు. విద్య, వైద్యరంగంలో మంచిర్యాలను ముందు ఉంచేందుకు రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందన్నారు. మంచిర్యాల మార్కెట్‌లో రోడ్లు ఇరుకుగా ఉండడంతో మాస్టర్‌ప్లాన్ ప్రకారంగా రోడ్ల విస్తరణతోపాటు అభివృద్ధి చేసేందుకు అవసనరమైన నిధులు విడుదల చేయించారని వివరించారు. అనంతరం వ్యాపారులతో కలిసి టపాసులను కాల్చారు. కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ వేణు, నాయకులు సంపత్‌రెడ్డి, సిరిపురం రాజేశ్, పెంట రజిత, గజ్జల హేమలత, రామగిరి బానేష్, ఖాలిద్, జలీల్, డేగ బాపు, సత్యనారాయణ, రమణరావు, జగన్ మోహన్, ప్రభాకర్, సాయి పాల్గొన్నారు.
జిల్లాలో 17.6 మి.మీ
వర్షపాతం
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు 17.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. కాసిపేట 43.9 మి.మీలు. దండేపల్లిలో 25.8, జన్నారంలో 5.2, లక్సెట్టిపేటలో 26.6, జైపూర్‌లో 23.7, హాజీపూర్‌లో 22.4, బెల్లంపల్లి 21.9, మంచిర్యాలలో 17.1, తాండూర్‌లో 16.2, కన్నెపెల్లిలో 16.5, వేమనపల్లిలో 15.2, మందమర్రిలో 14.8, చెన్నూర్‌లో 14.7, నస్పూర్‌లో 13.9, నెన్నెలలో 10.7, భీమారంలో 10.5, కోటపల్లిలో 8.9, భీమినిలో 8.1, మిల్లిమీటర్ల వర్షం కురిసింది.