
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు..
భీమారం: అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. అనర్హులకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. మండలంలోని పోలంపల్లి, భీమారం, ఆర్కెపల్లి, అంకూసాపూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలుకేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రాజీవ్ యువవికాసం, ఇందిరమ్మ ఇళ్ల అంశాలను పరిశీలించారు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించాలని ఆదేశించారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. సన్నరకం వడ్లకు రూ.500 బోనస్‌తో పాటు మద్దతు ధర అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో మధుసూదన్, ఐకేపీ ఏపీఎం త్రయంబక్ ఉన్నారు.
జైపూర్: జైపూర్ మండలంలోని కొనుగోలు కేంద్రాలను కూడా కలెక్టర్ తనిఖీ చేశారు. కొ నుగోలు చేసిన ధాన్యం వెంటవెంటనే మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. మండలంలోని ముదిగుంట, షెట్‌పల్లి, కిష్టంపేట, కుందారం, వేలాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి పరిశీలించారు. కేంద్రాల్లో తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడంతోపాటు అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.