
వివాహానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు..
● చెట్టు విరిగిపడి మహిళ మృతి
జన్నారం: బంధువుల ఇంట్లో పెండ్లికి హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా ఈదురు గాలులకు చెట్టు విరిగి మీదపడడంతో మహిళ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజవర్దన్ తెలిపిన వివరాల ప్రకారం దండేపల్లి మండలం వెంకటపూర్ గ్రామానికి చెందిన శనిగారపు జగన్, అతని భార్య సునీత (37)తో కలిసి బుధవారం కడెం మండలంలోని లింగపూర్‌లో ఉన్న బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో జన్నారం మండలం మహ్మదబాద్ గ్రామ సమీపంలోకి చేరుకునే సరికి బలమైన గాలులు వీయడంతో చెట్టు విరిగి సునీతపై పడడంతో బైక్‌పై నుంచి ఇద్దరు కిందపడిపోయారు. తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థాని కులు లక్సెట్టిపేట ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సునీత అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. జగన్‌ను మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి చెవుల మద్ది శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.