
మూడు తరాల నుంచి భూదానం
● వారసత్వంగా భూమిని దానం చేస్తున్న కుటుంబం
సాత్నాల: తాత నుంచి మనవళ్ల వరకు భూదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది భోరజ్ మండలంలోని గిమ్మ గ్రామానికి చెందిన నాలం కుటుంబం. ఊరి కోసం తమవంతు సాయంగా లక్షల రూపాయల విలువచేసే భూమిని విరాళంగా అందించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. భోరజ్ మండలంలోని జాతీయ రహదారికి ఐదు కిలో మీటర్ల దూరంలో గిమ్మ గ్రామం ఉంది. గ్రామానికి చెందిన నాలం కుటుంబ సభ్యులు తమ సొంత భూమిలో ఆ ఊరి ప్రజల రాకపోక కోసం తారురోడ్డు నిర్మాణం కోసం భూమిని వదిలిపెట్టారు. గ్రామంలోని పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పాఠశాల భవనం, వసతిగృహం కోసం, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆస్పత్రి, పశువుల కోసం వెటర్నరి ఆస్పత్రి, శ్మశాన వాటిక, రైతువేదిక నిర్మాణానికి ఆరున్నర ఎకరాల భూమిని విరాళంగా అందించారు. తాత నాలం రాములు నుంచి మనవళ్లు నాలం వామన్, నాలం అనిల్ వారసత్వంగా భూదానం చేస్తున్నారు. నాలం రాములు, అతని కుమారుడు వామన్ కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. వామన్ కుమారుడు నాలం అనిల్‌సైతం తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ తాత దారిలోనే పయనిస్తున్నాడు.
తోచిన సాయం చేస్తా
మా తాత రాములు, నాన్న వామన్ మదిలో గ్రామాభివృద్ధికోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేది. ఊరి కోసం ఆరెకరాల భూమిని అందించారు. నేను కూడా నాకు తోచిన సాయం చేసేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. ఇటీవల రైతు వేదిక కోసం భూమిని విరాళంగా ఇచ్చాం.
– నాలం అనిల్

మూడు తరాల నుంచి భూదానం