
పసికందు పాల కోసం ఆవు విరాళం
ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తిప్పకొలంగూడ గ్రామానికి చెందిన ఆత్రం రాణిబాయి ఏప్రిల్ 18న ఆడపిల్లకు జన్మనిచ్చింది. మే 15న రాణిబాయి అనారోగ్యంతో మృతి చెందింది. పాపకు జన్మనిచ్చిన నెలలోపే రాణిబాయి మృతి చెందగా బాధిత కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి ఇటీవల పరామర్శించారు. పాలకోసం ఆ చిన్నారి పడే తపనను చూసి చలించారు. పాపకు పాలు అందించేందుకు ఓ ఆవును కొనిస్తానని బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. మంగళవారం ఓ ఆవుతో పాటు లేగదూడను ఆ చిన్నారి తండ్రి ఆత్రం కృష్ణ, తాత, నానమ్మ కటోడ బూరిబాయికి అందించారు. ఈ సందర్భంగా ఈశ్వరీబాయికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.