
280 క్వింటాళ్ల జొన్నల పట్టివేత
● ఏపీ నుంచి ఆదిలాబాద్ జిల్లాకు అక్రమంగా తరలింపు ● వేర్వేరు చోట్ల రెండు లారీలు సీజ్
నేరడిగొండ/సిరికొండ: ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లాకు అక్రమంగా జొన్నలను తరలిస్తున్న రెండు లారీలను నేరడిగొండ, సిరికొండ మండలాల్లో పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 280 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నారు.
నేరడిగొండలో 250 క్వింటాళ్లు..
నిర్మల్‌కు చెందిన ఓ ట్రేడర్ ఆంధ్రప్రదేశ్ నుంచి లారీలో 250 క్వింటాళ్ల జొన్నలను తరలిస్తుండగా వాంకిడి గ్రామ సమీపంలో సోమవారం పట్టుకున్నట్లు స్థానిక ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. పంచనామా అనంతరం వ్యవసాయ శాఖ, పీఏసీఎస్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.
సిరికొండలో 30 క్వింటాళ్లు..
ఆంధ్రప్రదేశ్ నుంచి సిరికొండ మండలానికి జొన్నలను అక్రమంగా లారీలో తరలిస్తుండగా స్థానిక పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎస్సై శ్రీసాయి తెలిపిన ప్రకారం వివరాలు.. మండలంలోని రాంపూర్(బి) గ్రామానికి జొన్నల లోడుతో వచ్చిన లారీని ముందస్తు సమాచారం మేరకు పోలీసులు తనిఖీ చేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా కావలి నుంచి 30 క్వింటాళ్ల జొన్నలను తీసుకొచ్చినట్లు గుర్తించారు. అయితే వీటిని ఎవరు తీసుకొచ్చారు.. ఎందుకు తీసుకొచ్చారు వంటి సమాధానాలు సదరు డ్రైవర్ పేర్కొనకపోవడం గమనార్హం. రెవెన్యూ అధికారుల పంచనామా అనంతరం పట్టుబడిన లారీని స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.