
అక్రమ నిర్మాణం అడ్డగింతలో ఉద్రిక్తత
నెన్నెల: మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబరు 876లో ఇంటి నిర్మాణ పనులు సోమవారం అధికారులు అడ్డుకోవడం రసాభాసగా మారింది. ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు బయటకు రావడానికి నిరాకరించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు మహిళను బయటకు తీసుకొచ్చే క్రమంలో స్పృహా కోల్పోవడంతో 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎంఆర్‌సీ భవనం ఎదుట కొనుగోలు చేసిన భూమిలో గీసరి సాయికుమార్ ఇంటి నిర్మాణం చేపట్టాడు. ప్రభుత్వ స్థలమని ఫిర్యాదులు రావడంతో రెండ్రోజుల క్రితం బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ ఇంటిని సీజ్ చేశారు. సాయికుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పనులు సాగుతున్నట్లు మరోసారి ఫిర్యాదు రావడంతో ఇంటిని సీజ్ చేసేందుకు డెప్యూటీ తహసీల్దార్ ప్రకాష్, ఆర్‌ఐ సులోచన, ఎస్సై ప్రసాద్ సిబ్బందితో కలిసి సోమవారం వెళ్లారు. ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు బయటకు వచ్చేందుకు నిరాకరించారు. గంటన్నరపాటు వారిని సముదాయించి బయటకు తీసుకొచ్చి ఇంటికి తాళం వేశారు. రాజకీయ నాయకుల ఒత్తిడితో అధికారులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సాయికుమార్ వాపోయాడు. చుట్టుపక్కల నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోకుండా తనను అడ్డుకుంటున్నారని ఆరోపించాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటిని సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.