
వంతెన.. తీరని చింత!
త్వరగా నిర్మిస్తే మేలు
జిల్లాలో పారిశ్రామిక, ఉపాధి రంగాలు మెరుగపడాలంటే మెరుగైన రోడ్డు రవాణా వ్యవస్థ ఉంటే మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో ఎన్‌హెచ్–363, 63 అందుబాటులోకి వచ్చాయి. లక్సెట్టిపేట, మంచిర్యాల మధ్య విస్తరించాల్సి ఉండగా, ఇటీవల అన్ని అనుమతులు వచ్చాయి. ఇక జైపూర్ మీదుగా వరంగల్‌ను కలిపే ఎన్‌హెచ్–163జీ సైతం నిర్మాణం సాగుతోంది. ఈ క్రమంలో గోదావరిపై మరో వంతెన నిర్మిస్తే, జిల్లాలో ఐటీ, పారిశ్రామిక పార్కు, బసంత్‌నగర్ ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా మారనుంది. అంతేకాక పర్యాటకంగానూ మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గోదావరినదిపై రోడ్డు బ్రిడ్జి నిర్మాణ పనులు ఈ వేసవిలోనూ మొదలయ్యేలా కనిపించడం లేదు. ఏళ్లుగా మంచిర్యాల నగరాన్ని గోదావరి అవతలి వైపు ఉన్న పెద్దపల్లి జిల్లా అంతర్గాం, రామగుండం, ఎన్టీపీసీ ప్రాంతాలతో చేరువ చేసేందుకు వంతెన నిర్మించాలనే డిమాండ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఇందారం బ్రిడ్జితో దూరభారంతోపాటు భవిష్యత్‌లో రోడ్డు ట్రాఫిక్ మరింత పెరిగితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పారిశ్రామిక కారిడార్‌గా ఉన్న కోల్, పవర్ సిటీలుగా ఉన్న ఎన్టీపీసీ, మంచిర్యాల ప్రాంతాలను కలిపేలా గోదావరిపై మరో వంతెన ఆవశ్యకత ఏర్పడింది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ మార్గంతో ప్రజల రవాణా సులభతరం కానుంది. గత కొంతకాలంగా కొత్త వంతెన నిర్మాణం ఒక అడుగు ముందుకు మరో అడుగు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది.
నిర్మాణంలో తీవ్ర జాప్యం
గత ఏడేళ్లుగా ఈ వంతెన నిర్మాణంలో జాప్యం జరుగుతుండగా, ఇప్పటికీ ఎక్కడ నిర్మిస్తారనే స్పష్టత రావడం లేదు. 2018 ఫిబ్రవరిలో జిల్లా పర్యటనకు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జిపై హామీ ఇచ్చారు. ఆ మేరకు గోదావరిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి మొదట రూ.125కోట్లు అవసరమని అధికారులు అంచనా వేయగా, పరిపాలన అనుమతులు వచ్చాయి. ‘ప్లాన్ ఫర్ వర్క్’ కింద నిధులు కూడా మంజూరు అయ్యాయి. టెండర్లు ఖరారులో తీవ్ర జాప్యం జరిగింది. చివరకు ఓ కాంట్రాక్టు సంస్థ పనులు దక్కించుకుంది. కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవ సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ పనులు లాంఛనంగా ప్రారంభించారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికలతో జాప్యం జరిగింది. ఆ సమయంలోనే నదిలో వంతెన నిర్మాణం కోసం ప్రాథమిక పరీక్షలు చేశారు. గోదావరి పుష్కరఘాట్ వద్ద నేల స్వభావం, పిల్లర్లు, సామర్థ్యం తదితర ఇంజనీరింగ్ పనులు జరిగాయి. తర్వాత కాంట్రాక్టరు పనులు నిలిపివేశారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డాక ఆ వంతెన పనులను పూర్తిగా పక్కకు పె ట్టింది. ఆ తర్వాత మంజూరు చేసిన వంతెనను పూ ర్తిగా రద్దు చేస్తూ మరో చోట కొత్త నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు ముల్కల పరిధిలో నూతన బ్రిడ్జి నిర్మించి, ఎన్‌హెచ్–63 కలిపేలా నిర్మిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు స్థల పరిశీలన చేశారు. ఇప్పటికీ అధికారికంగా వంతెన నిర్మాణంపై ప్రకటన రాలేదు. దీంతో కొత్త వంతెన నిర్మాణంలో మరింత జాప్యం అయ్యేలా కనిపిస్తోంది.
గోదావరిపై బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం
ఈ వేసవిలోనూ మొదలు కాని పనులు
ఏడేళ్లుగా స్థానికుల నిరీక్షణ