
అవినీతి నిరోధానికి సహకరించాలి
● ఏసీబీ డైరెక్టర్ తరుణ్‌జోషి ● సీసీసీ నస్పూర్‌లో ఏసీబీ కార్యాలయం ప్రారంభం
నస్పూర్: అవినీతి నిరోధానికి ప్రజలు సహకారం అందించాలని ఏసీబీ డైరెక్టర్ తరుణ్‌జోషి అన్నారు. సీసీసీ నస్పూర్‌లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతి అధికారులపై ఫిర్యాదు చేయడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు. గత పదేళ్ల కేసులను పరిశీలిస్తే మంచిర్యాల ప్రాంతం నుంచే ఫిర్యాదులు అధికంగా ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో ఏసీబీ కార్యాలయాన్ని ప్రారంభించామని అన్నారు. తనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో అనుబంధం ఉందని, విస్తీర్ణంలో జిల్లా చాలా పెద్దదని తెలిపారు. ఇక్కడ డీఎస్పీ స్థాయి అధికారి అందుబాటులో ఉంటారని, నిర్మల్, ఆదిలాబాద్ ప్రజల సౌకర్యార్థం ఆదిలాబాద్‌లో ఉన్న కార్యాలయంలో సేవలు కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రంలో 10 రేంజ్‌లు ఉన్నాయని, వాటి పరిధిలో నమోదైన ప్రతీ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, 80శాతం కేసుల్లో నేరం రుజువై అవినీతి అధికారులకు శిక్ష పడిందని తెలిపారు. నేరుగా ఫిర్యాదు చేయడంలో ఇబ్బందులుంటే 1064 టోల్ ఫ్రీ నంబర్ లేదా ఏసీబీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రాజేశ్ మురళి, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్, ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్, కరీంనగర్ ఏసీబీ కోర్టు పీపీ జ్యోతి, శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జీఎం శ్రీనివాస్, సీఐలు పాల్గొన్నారు.