
కోడిగుడ్లు నాసిరకం..?
● అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా ● సెలవుల నేపథ్యంలో ఇంటికే సరుకులు ● పాడైనవి వస్తున్నాయంటున్న లబ్ధిదారులు
మంచిర్యాలటౌన్: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కోడిగుడ్లు అందజేస్తోంది. మూడేళ్లు పైబడిన చిన్నారులు, గర్భిణులు, బాలింతలు నేరుగా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి పప్పు, ఆకుకూరలు, కోడిగుడ్డుతో కూడిన మధ్యాహ్నం భోజనం చేస్తుండగా.. మూడేళ్లలోపు చిన్నారులకు నెలకు 16 కోడిగుడ్లు, బాలామృతం ఇంటికే ఇస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు మే నెల వేసవి సెలవుల కారణంగా పౌష్టికాహారాన్ని నేరుగా లబ్ధిదారులకే ఇస్తున్నారు. కోడిగుడ్లు ఇంటికి తీసుకెళ్లి మంచివో కావో తెలుసుకునేందుకు నీటిలో వేయగా తేలుతున్నాయి. పగులగొట్టి చూస్తూ పాడై ఉంటుండడంతో పడేస్తున్నారు. సగానికి పైగా పాడైనవి ఉంటున్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు. జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా నాసిరకం కోడిగుడ్లు, తక్కువ బరువు ఉన్నవి, నిల్వ కోడిగుడ్లను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్ నేరుగా అంగన్‌వాడీ కేంద్రాలకే గుడ్లు సరఫరా చేస్తుండగా.. నిబంధనల ప్రకారం ఉన్నవాటినే టీచర్లు తీసుకోవాల్సి ఉంటుంది. కోడిగుడ్ల సరఫరాలో జిల్లా వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒక గుడ్డు కనీస బరువు 50గ్రాములు ఉండాలనే నిబంధన ఉంది. కానీ ఒక ట్రేలో 30కోడిగుడ్లు ఉంటే అందులో ఐదు నుంచి పది ఎక్కువ బరువు ఉన్నవాటిని ఉంచి మొత్తం ట్రే బరువు 1500 గ్రాములకు దగ్గరలో ఉండేలా చూస్తున్నారు. కచ్చితంగా బరువు చూసి తీసుకునే టీచర్లు ఉన్నచోట ఈ విధానం అమలు చేస్తుండగా.. ప్రశ్నించని వారి కేంద్రాలకు బరువుతో సంబంధం లేకుండా చిన్న పరిమాణంలో ఉన్నవి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న వాటిని సరఫరా చేయడం వల్ల ఉడకబెట్టే సమయానికి లోపల చెడిపోయి దుర్వాసన వస్తుండడంతో బయట పడేస్తున్నారు. దీంతో లబ్ధిదారులకు పౌష్టికాహారం అందడం లేదు.
జిల్లా వివరాలు
అంగన్‌వాడీ కేంద్రాలు : 969
గర్భిణులు : 4.245
బాలింతలు : 3,186
చిన్నారులు : 45,455
చిన్నగుడ్లను తిరిగి ఇచ్చేస్తాం
అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించినప్పుడు చిన్న పరిమాణంలో కోడిగుడ్లు ఉంటే వెనక్కి పంపించి మళ్లీ తెప్పిస్తున్నాం. అంగన్‌వాడీ టీచర్లు చిన్న వాటిని, పాడైనవి ఉంటే తీసుకోవద్దని చెబుతున్నాం. ఎవరైనా చిన్నసైజువి, నాణ్యత లేనివి తీసుకుంటే చర్యలు తీసుకుంటాం. – రౌఫ్‌ఖాన్,
జిల్లా సంక్షేమశాఖ అధికారి, మంచిర్యాల

కోడిగుడ్లు నాసిరకం..?