
సన్నరకం వడ్లు కొనుగోలు చేయాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్
చెన్నూర్‌రూరల్: సన్నరకం వడ్లను ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ డిమాండ్ చేశారు. మండలంలోని కిష్టంపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల సాగును ప్రోత్సహించి సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేసిందన్నారు. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని తెలిపారు. ఈ విషయమై రైతులు ఆందోళన చేసిన తర్వాత ఒక్క లోడ్ వడ్లు క్వింటాలుకు 20కిలోలు ఎక్కువగా తూకం వేసుకుని ఒక మిల్లర్ తీసుకున్నాడని ఆరోపించారు. నూకల పేరుతో రైతులను వేధించడం మానేసి కల్లాల్లోని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఇంత కష్టపడుతుంటే ఎమ్మెల్యే వివేక్ స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, మండల అధ్యక్షుడు బుర్ర రాజశేఖర్‌గౌడ్, మండల సీనియర్ నాయకుడు ఆలం బాపు, కొటారి వెంకటేష్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏతం శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.