
డెంగీతో జాగ్రత్త
● దోమల వృద్ధితోనే వ్యాప్తి ● నీటి నిల్వలు లేకుండా చూడాలి ● పారిశుధ్యం మెరుగుపర్చుకోవాలి ● నేడు జాతీయ డెంగీ దినోత్సవం
మంచిర్యాలటౌన్: ప్రజలు తమ ఇంటి పరిసరా లను పరిశుభ్రంగా ఉంచుకుని, నీరు నిల్వలేకుండా చేసుకుంటే డెంగీ కట్టడి సాధ్యమవుతుంది. సరైన పారిశుధ్య చర్యలు, ప్రజల్లో అవగాహనతోనే అరికట్టవచ్చు. వర్షాకాలం ముందు నుంచే డెంగీతోపాటు ఇతర వ్యాధులపై వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలతోపాటు ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహిస్తోంది. అయినప్పటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డెంగీ విజృంబిస్తోంది. ఒక ఏడాది కేసులు తగ్గితే, మరో ఏడాది పెరుగుతున్నాయి. ప్రజల్లో చైతన్యం వచ్చి తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోనే ఈ వ్యాధి బారినపడకుండా ఉండవచ్చు. మన ఇల్లు, ఇంటి పరిసరాల్లో నిల్వ నీటిలో అనాఫిలస్, క్యూలెక్సిస ఈడిస్, ఆర్మిజరిస్ దోమలు పెరుగుతాయి. ‘ఏజిస్ ఈజిప్టయి’అనే దోమకాటుతో డెంగీ సోకుతంది. చికెన్ గున్యా కంటే ఎక్కువగా ఒంట్లో శక్తిని హరిస్తుంది. మే 16న (శుక్రవారం) జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
ముందు జాగ్రత్తలతోనే మేలు
ఏటా డెంగీ బారినపడుతున్న వారి సంఖ్య వందల్లో ఉండగా, అడపాదడపా మరణాలు సంభవించిన ఘటనలు జిల్లాలో చోటుచేసుకున్నాయి. రానున్న వర్షాకాలం దృష్ట్యా జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్తలు పాటిస్తూ, సరైన ప్రణాళికతో ముందడుగు వేయడం, ప్రజలను భాగస్వాములను చేయడంతో డెంగీని అరికట్టే అవకాశం ఉంది. ఏజిస్ ఈజిప్టయి రకం ఆడదోమ కాటు వేయడం డెంగీ వస్తుంది. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను ఆవాసంగా చేసుకుని దోమలు వృద్ధి చెందుతాయి. ప్రధానంగా కూలర్లు, పూలకుండీలు, వాడిపడేసిన టైర్లు, కొబ్బరిబొండాల్లో ఆవాసం ఏర్పరుచుకుని, స్వైర విహారం చేస్తాయి. ఈ దోమ కుట్టడం వల్ల తీవ్ర జ్వరం, శరీరంపై ఎర్రని దద్దుర్లు, తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పి, ఆకలి మందగించడం, ఎర్ర రక్తకణాలు(ప్లేట్‌లెట్స్) తగ్గిపోతాయి. సకాలంలో గుర్తించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి, డెంగీ నిర్దారణకు ‘ఎలీసా పరీక్ష’చేసుకుని నిర్దారించుకున్న తర్వాత చికిత్స తీసుకోకువాలి. అధికంగా వృద్ధులు, చిన్నారులు, మధుమేహం బాధితులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై వీటి ప్రభావం ఎక్కువే. దోమలను అడ్డుకట్ట వేయడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.
జాగ్రత్తలు తీసుకోవాలి
● దోమల బారినుంచి కాపాడుకోవటమే కాక దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధుల నుంచి ఎవరికి వారే రక్షించుకోవాలి.
● ఇంట్లో గాని, ఇంటి ఆవరణలో గాని నీళ్ల కుండీలు, డ్రమ్ములు, గోళాలు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులు వంటి వాటిపై దోమలు గుడ్లు పెట్టకుండా మూతలు పెట్టాలి.
● వారానికోసారి నీరు నిల్వ చేసిన పాత్రలను ఖాళీ చేయాలి. ఇంటి ఆవరణలో నీటి గుంటలు లేకుండా చూడాలి.
● ఇంటిపై ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకులపై దోమలు గుడ్లు పెట్టకుండా మూతలు పెట్టాలి.
● సెప్టిక్ ట్యాంక్ గొట్టం, గ్యాస్ పైప్‌లైన్ పైన పలచని బట్ట చుట్టాలి. దీనివల్ల దోమల నివారణ జరుగుతుంది.
● మురుగుకాల్వల్లో ఎప్పటికప్పుడు చెత్తా చెదారం తొలగించాలి.
● పనికిరాని సీసాలు, డబ్బాలు, రబ్బరు టైర్లు, వాటర్ కూలర్లు, ఇతర ఏ పాత్రలైనా సరే నీరు నిల్వ లేకుండా చూడాలి.
● దోమతెరలు, ఇంటి కిటికీలకు జాలీలు వాడడం, దోమలు కుట్టకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
జిల్లాల వారీగా కేసులు
ఏడాది మంచిర్యాల కుమురం భీం ఆదిలాబాద్
2020 32 65 205
2021 116 94 231
2022 118 40 207
2023 72 88 108
2024 224 50 366
2025 2 1 --
నివారణ అందరి బాధ్యత
డెంగీతోపాటు ఇతర వ్యాధులను నివారించడం అందరి బాధ్యత. ఇంటి పరిసరాల్లో పారిశుధ్యం మెరుగుపర్చుకోకపోవడం, నీరు నిల్వ లేకుండా చూడకపోవడం వల్ల దోమలు వృద్ధి చెందుతున్నాయి. తద్వారా డెంగీ ప్రబలే అవకాశాలు ఉన్నాయి. డెంగీకి సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే, ప్రాణాంతకంగా మారుతుంది. జిల్లాలో డెంగీ వ్యాధి కట్టడికి వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో చర్యలను తీసుకోవడంతోపాటు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
– డాక్టర్ హరీశ్‌రాజ్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, మంచిర్యాల

డెంగీతో జాగ్రత్త

డెంగీతో జాగ్రత్త