
డీసీఎంఎస్‌కు మంగళం..!
● మరో శాఖలో విలీనానికి కసరత్తు ● సిద్ధమవుతున్న ప్రతిపాదనలు
కై లాస్‌నగర్: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లకు ప్రభుత్వం మంగళం పాడనుంది. అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఈ సంస్థను మరో శాఖలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. డీసీఎంఎస్ చైర్మన్ల పదవీకాలం పొడిగించకపోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ సంస్థను మార్క్‌ఫెడ్, హాకా శాఖల్లో విలీనం చేయాలని గత ప్రభుత్వం భావించింది. అయితే ఆ దిశగా కార్యాచరణ సాధ్యం కాలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డీసీఎంఎస్‌ను విలీనం చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) మాత్రం ఇప్పటికీ ఉమ్మడిగానే కొనసాగుతుంది. దీని పరిధిలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఎరువులు, వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 150 కేంద్రాల ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నష్టాల్లో కొనసాగిన ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో లాభాల బాటలో పయనిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ సంస్థ చేసిన వ్యాపారాల ద్వారా గతేడాది రూ.12 కోట్ల టర్నోవర్ సాధించింది. వరి ధాన్యం కొనుగోళ్ల ద్వారా మరో రూ.20 లక్షల వరకు కమీషన్ రూపంలో ఆదాయం సమకూరింది. అలాగే ఈ సంస్థ ద్వారా జిల్లా కేంద్రంలోని వ్యవసాయ పరిశోధన స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, రిమ్స్ ఆస్పత్రికి అవసరమైన వస్తువులను సరఫరా చేస్తున్నారు. తద్వారా ఏటా సంస్థకు మరో రూ.20 లక్షల ఆదాయం వరకు సమకూరుతుంది. ఇలా ఆర్జించిన లాభాల ద్వారా జిల్లా కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్‌తో కూడిన సంస్థ కార్యాలయ భవనాన్ని రూ.5 కోట్లతో నిర్మించారు. ఇప్పుడిప్పుడే వ్యాపార పరంగా లాభాల బాటలో ఉన్న ఈ సంస్థను ఇతర శాఖల్లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం.
జిల్లా కేంద్రంగానే కార్యకలాపాలు..
ఉమ్మడి జిల్లా పరిధిలో సంస్థ పనిచేస్తున్నప్పటికీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగానే దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వరిధాన్యం కొనుగోలును పర్యవేక్షించేందుకు మంచిర్యాల, నిర్మల్ జిల్లా కేంద్రాల్లో శాఖలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ పరిధిలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 20 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, నిర్మల్‌లో ఒకరు, మంచిర్యాలలో ముగ్గురు విధులు నిర్వహిస్తున్నారు. డీసీఎంఎస్‌ను ఇతర శాఖలో విలీనం చేస్తే వీరంతా ఆయా శాఖల్లో పనిచేయాల్సి వస్తోంది. కాగా, కొన్నేళ్లుగా లాభాలు అర్జిస్తున్న సంస్థను ఉన్నపాటుగా విలీనం చేసినట్లయితే రైతులకు అందాల్సిన సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉద్యోగులు సైతం ఆ శాఖలో అలవాటు లేని విధులను నిర్వహించాల్సి వస్తుందని చెబుతున్నారు.
కోర్టును ఆశ్రయించిన డీసీఎంఎస్ చైర్మన్..
డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల పదవీకాలం ఇటీవల ఏకకాలంలో ముగిసింది. అయితే డీసీసీబీ చైర్మన్ పదవీకాలాన్ని ఆరు నెలల పాటు పొడగించిన ప్రభుత్వం డీసీఎంఎస్ చైర్మన్ పదవీ కాలం మాత్రం పొడగించలేదు. ఈ సంస్థను ఇతర శాఖలో విలీనం చేసేందుకే చైర్మన్ పదవీకాలాన్ని పొడిగించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ సంస్థకు జిల్లా అదనపు (రెవెన్యూ) కలెక్టర్ శ్యామలాదేవి పర్సన్ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. కాగా, తన పదవీకాలాన్ని పొడగించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో డీసీఎంఎస్ చైర్మన్ కోర్టును ఆశ్రయించారు.
డీసీఎంస్ పరిధిలో.. పీఏసీఎస్‌లు 77
సిబ్బంది 29
వార్షికాదాయం రూ.4కోట్లు
అప్పులు రూ.2కోట్లు
ప్రతిపాదనలు పంపిస్తున్నాం..
జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థకు సంబంధించి ఆదాయ, వ్యయ, అప్పులు, ఆస్తులు వంటి వివరాలను పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. ఇతర జిల్లాలతో పోల్చితే ఆదిలాబాద్ డీసీఎంఎస్ లాభాల బాటలో ఉంది. దీన్ని ఇతర శాఖల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
– బి.మోహన్, జిల్లా సహకార అధికారి