
రైతులపై రాళ్లతో దాడి
● మార్కెట్‌యార్డులో దొంగతనానికి యత్నించిన మైనర్లు ● ఇద్దరు అన్నదాతలకు గాయాలు
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో జొన్న పంట విక్రయించేందుకు వచ్చిన రైతులపై రాళ్లదాడి జరిగింది. బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో పట్టణంలోని వడ్డెర కాలనీకి చెందిన నలుగురు మైనర్లు పంట దొంగతనానికి యత్నించారు. అప్రమత్తమైన రైతులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా గోడ పైనుంచి దూకి పరారయ్యారు. ఈక్రమంలో వారు రాళ్ల దాడి చేయడంతో ఇద్దరు రైతులు తలకు గాయాలయ్యాయి. రామాయి రాంపూర్‌కు చెందిన సర్సం దిలీప్‌రెడ్డి, బరంపూర్‌కు చెందిన కూతవేణి నారాయణలను రిమ్స్‌కు తరలించి చికిత్స చేయించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్ యార్డుకు తెచ్చి విక్రయించేవరకు చోరీకి గురికాకుండా రైతులు రాత్రంతా జాగరణ చేయాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో శనగ, సోయాబీన్, పత్తి పంటలను సైతం పలువురు దొంగతనానికి యత్నించారు. మార్కెట్‌యార్డులో భద్రత పెంచాల్సిన అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా మార్కెట్ యార్డులో పోలీసు నిఘా ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, రైతులపై దాడిచేసిన నలుగురు మైనర్లపై బరంపూర్‌కు చెందిన రైతు చింతల రాకేశ్ టూటౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసునమోదు చేసినట్లు ఎస్సై విష్ణుప్రకాశ్ వివరించారు.

రైతులపై రాళ్లతో దాడి