
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ల శివారు ర్యాలీవాగు కల్వర్టు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. హాజీపూర్ పోలీసుల కథనం ప్రకారం.. గుడిపేటకు చెందిన భయ్యా మధుకర్(31) ఇంటింటికీ వెళ్తూ పాలు అమ్మడంతోపాటు విద్యుత్ వైరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం బైక్‌పై పాలతో వెళ్తున్నాడు. మంచిర్యాల నుంచి ముల్కల్ల ఇసుక రీచ్‌కు వస్తున్న ట్రాక్టర్ అజాగ్రత్తగా నడుపుతూ అతివేగంగా బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మధుకర్ తలకు తీవ్ర గాయాలు కాగా, ట్రాక్టర్ పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య మౌనిక, మూడేళ్ల కుమార్తె శాన్విక ఉంది. మృతుడి తండ్రి సత్తయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపారు. కాగా మధుకర్ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో అతని కుమార్తె శాన్విక భవిష్యత్తు కోసం గుడిపేట స్థానికులు విరాళాలు సేకరిస్తున్నారు.