మామిడి తోటలపై ఎండల ప్రభావం
● రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి ● ఉద్యానవనశాఖ అధికారి కళ్యాణి
చెన్నూర్‌రూరల్: వేసవికాలంలో మండుతున్న ఎండల నుంచి పండ్ల తోటలను రక్షించుకోవడంపై రైతులు దృష్టి సారించాలని హెచ్‌వో కళ్యాణి సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడం, గాలిలో తేమశాతం తగ్గుముఖం పట్టడంతో పండ్ల తోటల్లో కాయలపై పొడలు ఏర్పడి పెరుగుదల తగ్గిపోవడమే కాకుండా నాణ్యత కూడా దెబ్బతింటుంది. నాణ్యత లోపించిన కాయలకు మార్కెట్‌లో ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వేసవిలో పండ్ల తోటలపై కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. మంచిర్యాల జిల్లాలో సుమారు 18 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. ఇందులో చెన్నూర్ మండలంలోని ఎర్రగుంటపల్లి, కొమ్మెర, ఆస్నాద, బుద్దారం, సంకారం, కన్నెపల్లి, పొక్కూరు, తదితర గ్రామాల్లో ఎక్కువ మొత్తంలో సాగవుతున్నాయి.
మామిడి తోటల రక్షణ
వేసవిలో ఎండలు పెరిగే కొద్ది కాయలపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఎండ వేడిమికి కాయలు దెబ్బతిని పెరుగుదల, నాణ్యత తగ్గిపోతుంది. ఎండ సోకిన ప్రాంతంలో కాయకు గుంత పడుతుంది. చాలా సందర్భాల్లో 20 నుంచి 30 శాతం వరకు కాయలు ఎండ తీవ్రతతో దెబ్బతింటాయి. ఇందులో బంగినపల్లి, నీలం, తోతాపరి, పలు రకాల కాయలకు ఎండ బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో కోతకు ముందే కాయ లోపలి భాగంలో మచ్చలు ఏర్పడి కణజాలం కుళ్లుతుంది. దీంతో చాలా వరకు కాయలు రాలిపోతాయి. 20 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న తోటల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
నివారణ
పిందెలు గోలి సైజులో ఉన్నప్పుడు ఒకసారి, నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు మరోసారి లీటరు నీటికి 20 గ్రాముల సున్నం, అర మిల్లీ లీటరు జిగురు కలిపిన ద్రావణాన్ని పిందెలు, కాయలపై సన్నటి పార ఏర్పడేలా పిచికారీ చేయాలి.
ఎండల నుంచి కాయలకు రక్షణ
వేసవిలో ఎండలకు కాయలు కమిలి నాణ్యత బాగా దెబ్బ తినడం వలన ధర తక్కువగా పలికే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంతాలకు రవాణా చేసేందుకు పనికి రావు. గెలలకు ఎండిన ఆకులను చుట్టడం, గెలపై ఉన్న రెండు ఆకుల కాడలను మడచి ఆకులతో గెలతో ఆఛ్చాదనను ఏర్పాటు చేస్తే ఎండ నుంచి రక్షణ కల్పించవచ్చు. పాలిథిన్ సంచులు గెలలకు తొడిగి రక్షణ కల్పించవచ్చు. ఇలా చేయడం వల్ల కాయల కోత తరువాత అంత్రాక్నోస్ మచ్చ తెగులు తీవ్రత నుంచి కూడా కాపాడు కోవచ్చు. ఇలాంటి చర్యలు చేపడితే వేసవిలో ఎండ తాకిడికి పండ్ల తోటలను రక్షించుకునేందుకు అవకాశం ఉంది.


